- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పాలిటిక్స్‌లో సరికొత్త మలుపు
హైదరాబాద్ వేదికగా పవన్ కల్యాణ్ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణవాదుల మధ్య చెలరేగిన సవాల్-ప్రతిసవాళ్లు. వచ్చే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటన.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణ వాదులుగా సాగిన సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే ఎండవేడితో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాలు రాజకీయ ఆరోపణలు, విమర్శలతో మరింత వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ ఏర్పాటు నిర్ణయం, దానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం, చివరికి హైకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా జనసైనికులకు నిరాశే మిగిలింది. చివరికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తో సరిపెట్టుకోగా, ఆయన మాటలతో రాష్ట్రంలో ఒక్కసారిగా సెంటిమెంట్ రాజకీయం రాజుకున్నది.
పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ వాదులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో జనసేన, పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయాలు తిరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ పై విరుచుకుపడటంలో ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరు మీదున్నారు. పోటా పోటీగా ఆయనపై విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు విసురుతున్నారు.
గులాబీ గప్ చుప్..
పవన్‌కళ్యాణ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు పెద్ద నాయకులు ఎవ్వరూ మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో పెద్దగా స్పందించలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పవన్ కళ్యాణ్ వ్యవహరంపై ఏ విధంగా స్పందించాలనేది సమయం తీసుకోవాలని, కేసీఆర్ అభిప్రాయం, ఆలోచన తరువాత స్పందించే అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత రెండు రోజుల క్రితమే పవన్ పై వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్‌కళ్యాణ్ ప్రెస్ మీట్ లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. తానే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తానని వెల్లడించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనే దానిపై స్పష్టత వచ్చింది. పవన్‌కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
పవన్ వ్యాఖ్యలపై అభ్యంతరం
రాష్ట్రంలో పవన్పర్యటనలతో మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ ఆస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై పుష్కర కాలంగా తెలంగాణవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఆయన ఏనాడూ వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పకపోవడంతో వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల తమ పార్టీ పై తెలంగాణ చెందిన పలువురు విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా చేశారని, ఆ నేపథ్యంలో ఇక్కడ సభ పెట్టాలనుకోవడం, దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా మాట్లాడారు.
టార్గెట్ కాంగ్రెస్ ..
పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో పవన్ వర్సెస్ కాంగ్రెస్‌లాగా వ్యవహరం సాగుతోంది. మిగిలిన పక్షాలు మాత్రం పైపైనే స్పందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏపిసోడ్ ఎక్కడికి దారితీస్తుందో... ? ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని కొంత ఆందోళన వ్యక్తం అయింది. కానీ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రభుత్వ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అవిర్భావం దినోత్సవం వేళ శాంతి భద్రతల పరంగా ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని కొంత ఆందోళన చెందారు.
తెలంగాణ వాదులు కానీ, వారి ముసుగులో ఇంకా సంఘ విద్రోహ శక్తులు కానీ పవన్ కళ్యాణ్ ఇంటిపై, వారి అభిమానులపై చిన్న దాడి చేసినా పరిస్థితి విషమించేందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. కానీ అవేవి జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే మరో రెండు మూడు రోజులు కూడా మాటల యుద్ధం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్యలో ఎలాంటి తారతమ్యాలు, వైషమ్యాలు లేకుండా పరిస్థితులు సాఫీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా అవుతాయా ? అనే ఆందోళనలో కొందరిలో వ్యక్తం అయినా చివరికి ప్రశాంతంగా ముగిసింది పవన్ కళ్యాణ్ఎపిసోడ్.






