తెలంగాణ మద్యం పాలసీపై ఏపీ సర్కార్ ఫోకస్

by Gantepaka Srikanth |

తెలంగాణ మద్యం పాలసీపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది.

తెలంగాణ మద్యం పాలసీపై ఏపీ సర్కార్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మద్యం పాలసీపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. పాలసీకి సంబంధించిన సమాచారాన్ని గురువారం ఏపీ ఎక్సైజ్‌ అధికారుల బృందం సేకరించారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులను కలిసి మద్యం పాలసీ విధివిధానలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మద్యం అమ్మకాలు, డిజిటల్‌ అమ్మకాలు ఎలా జరుగుతున్నాయనే విషయాలపై ఏపీ ఎక్సైజ్‌ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, పలనాడు డీపీఈఓ మణికంఠలు అడిషనల్‌ కమిషనర్‌ ఖురేషీని అడిగి తెలుసుకున్నారు.

రిటేల్‌ మద్యం షాపుల నుంచి డిజిటల్‌ రూపంలో చెల్లింపులు ఎలా జరుగుతున్నాయని, ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, పేమేంట్స్‌ను డిజిటల్‌లో ఎలా సమకూర్చుతున్నారనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ఏపీ నుంచి వచ్చిన ఎక్సైజ్‌ అధికారులు అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అధికారులు సమగ్రంగా అందించారు. ఏపీలో కొత్త మద్యం పాలసీని తెచ్చే క్రమంలో తెలంగాణతో పాటు, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేసేందుకు ఇతర బృందాలు కూడా వెళ్లాయని ఏపీ అధికారులు తెలిపారు. సేకరించిన సమాచారాన్ని తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరవేయనున్నట్లు అధికారుల బృందం తెలిపింది.

Next Story