కర్నూల్ బస్సు ప్రమాదం ఘటన.. బైక్ కు నో హెడ్ లైట్.. పెట్రోల్ బంక్ విజువల్స్ లో ట్విస్ట్

by Prasad Jukanti |   (  Updated:2025-10-26 13:16:34  IST  )

వేమూరి కావేరి ట్రావేెల్స్ బస్సు ప్రమాదానికి కారణం అయిన బైక్ విషయంలో మరో కొత్త చర్చ తెరమీదకు వస్తోంది.

కర్నూల్ బస్సు ప్రమాదం ఘటన.. బైక్ కు నో హెడ్ లైట్.. పెట్రోల్ బంక్ విజువల్స్ లో ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపిన కర్నూల్ బస్సు ప్రమాదం (Kurnool bus accident) ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదు అవుతున్నాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Vemuri Kaveri Travels) బైక్ ను ఢీ కొనడంతో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుందని మొదట అంతా భావించారు. కానీ బస్సు ఢీ కోవడానికి ముందే రోడ్డుపై బైక్ యాక్సిడెంట్‍కు గురైనట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ శివ శంకర్ బండి వెనకాల కూర్చున్న ఎర్రి స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెల్లడైంది.

పెట్రోల్ బంక్ లోకి రావడం కంటే ముందే యాక్సిడెంట్?:

చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ స్కిడ్ అయి పడిపోవడానికి ముందు అర్ధరాత్రి 2:24 గంటలకు కియా షోరూమ్ సమీంపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శివశంకర్, ఎర్రిస్వామి పల్సర్ బైక్ పై వచ్చి పెట్రోల్ పోయించుకున్నారు. పెట్రోల్ బంక్ లో శివశంకర్ బైక్ నడిపిన తీరుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో నిశితంగా గమనిస్తే మరికొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పెట్రోల్ బంక్‍లోకి వస్తున్న సయమంలో శివశంకర్ బైక్‍కు హెడ్ లైట్ కనిపించడం లేదు. డూమ్ ఉన్నప్పటికీ హెడ్ లైట్ మాత్రం లేదు. కేవలం సైడ్ ఇండికేటర్ లైట్‍తో మాత్రమే వారు జర్నీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మద్యం మత్తులో హెడ్ లైట్ లేకుండా మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే డివైడర్ కనిపించక స్కిడ్ అయి పడిపోయారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటిని పరిశీలిస్తే పెట్రోల్ బంక్ లోకి రావడానికి ముందు మరో చోట బైక్ యాక్సిడెంట్‍కు గురైందా లేక అంతకు ముందే బైక్‍కు హెడ్ లైట్ లేదా అనేది ప్రశ్నగా మారింది.

నెటిజన్ల ఆగ్రహం:

పెట్రోల్ బంక్ లో శివశంకర్, ఎర్రిస్వామి వీడియోను చూసిన నెటిజన్లు వారితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి నిర్లక్ష్యం 19 మంది నిండు ప్రాణాలను బలితీసుకుందని ఇలాంటి వారిని సమాజం క్షమించకూడదని పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇకనైనా జాగ్రత్త పడాలని, తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.

https://x.com/Telugufeedsite/status/1981990420214387105

Next Story