- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి కీలక ఖనిజ రంగంలో మరో ముందడుగు
సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో కీలక అడుగువేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో కీలక అడుగువేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ ఎన్.ఎఫ్.టి.డి.సి (నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్) తో ఈ మేరకు గురువారం సింగరేణి భవన్ లో సింగరేణి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, ఎన్.ఎఫ్.టి.డి.సి డైరెక్టర్ బాలసుబ్రమణియన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను మరింత వేగవంతం చేస్తోందని, దీనిలో భాగంగా సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకోవడానికి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్ ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎండీ బలరాం తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఎన్.ఎఫ్.టి.డి.సి నుంచి తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రయోగాత్మక ప్లాంట్ లో సింగరేణి ఓవర్ బర్డెన్ మట్టిలో లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తో పాటు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్ లోను, ఇతర వేస్ట్ మెటీరియల్స్ లోను లభ్యమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను గుర్తిస్తామని, ప్రయోగాత్మకంగా వీటిని ఉత్పత్తి చేయడం కూడా జరుగుతుందన్నారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభ్యతా శాతం, ఉత్పత్తికి గల అవకాశాలు, వ్యాపార కోణంలో లాభదాయకత తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి పెద్ద ఎత్తున ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
సింగరేణిలో ఓవర్ బర్డెన్ లో క్రిటికల్ మినరల్స్ గుర్తించాం...
సింగరేణిలో తాము ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించామని, కొన్ని క్రిటికల్ మినరల్స్ ఓవర్ బర్డెన్ మట్టిలోనూ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్ లోను ఉన్నట్లు గుర్తించామని, కొత్తగా స్థాపించనున్న పైలట్ ప్లాంటు ద్వారా మరింత సమగ్రమైన సమాచారం లభించనుందని ఎన్.ఎఫ్.టి.డి.సి డైరెక్టర్ బాలసుబ్రమణియన్ తెలిపారు. సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, జీఎంలు టి. శ్రీనివాస్, రాందాస్, శ్రీనివాసరావు, ఎన్.ఎఫ్.టి.డి.సి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- SSCL






