- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ భగ్నం.. హైదరాబాద్ పోలీసుల మెగా ఆపరేషన్
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమైన భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమైన ‘IGNITE’ భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. కేవలం 18 రోజుల క్రితమే ఏర్పాటైన ఈ సంస్థపై ఉక్కుపాదం మోపడం ద్వారా సుమారు రూ. 5 వేల కోట్ల మేర జరగబోయే మోసాన్ని అడ్డుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’ పేరుతో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పాత సీసాలో కొత్త మద్యం!
గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్లిక్ గ్లోబల్, క్యూనెట్ (QNET), విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్ నిర్వాహకులే ఈ ‘IGNITE’ వెనుక ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. గత మూడు దశాబ్దాలుగా ఒకే తరహా మోసపూరిత విధానాన్ని అమలు చేస్తూ... మొదట Gold Quest, ఆ తర్వాత QuestNet, ఆపై QNET, ఇప్పుడు IGNITE పేరుతో ఈ ముఠా రూపాంతరం చెందిందని సీపీ వివరించారు.
మోసపూరిత విధానం..
అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి బలవంతంగా ఉత్పత్తులను కొనుగోలు చేయించడం. గొలుసుకట్టు నెట్‌వర్క్.. చేరిన సభ్యుల చేత మరికొంతమంది కొత్త సభ్యులను చేర్పించడం ద్వారా లక్షలాది మందిని ఈ వలలోకి లాగడం వంటివి చేస్తారు. ‘ఈ స్కామ్‌కు సంబంధించిన ప్రధాన సూత్రధారులు హాంకాంగ్, దుబాయ్, మలేషియా వంటి విదేశాల్లో ఉన్నట్లు గుర్తించాం. బాధితుల నుంచి అందిన 3 ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఈ వ్యవహారాన్ని తదుపరి విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టికి తీసుకెళ్తున్నాం.’ అని ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రజలు ఇలాంటి గొలుసుకట్టు, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆశ చూపించే మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.






