- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: ఫీజు రీయింబర్స్ కు లేని డబ్బులు కమిషన్ ప్రాజెక్టులకెక్కడివి?.. సీఎంకు హరీశ్ రావు ప్రశ్న
రేవంత్ రెడ్డి సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు

దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై పీడీఎస్ యూ (PDSU) రూపొందించిన 'బిగ్ డిబేట్' పోస్టర్ ను ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో రూ.20 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయి? గ్రీన్ చానెల్ లో నిధుల విడుదల అన్న మీ మాటలు నీటి మూటలేనా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేదంటే విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ మరో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
'అల్లరి చేయొద్దు’ అని సుద్దులు చెప్తే గోడు తీరదు:
'అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని హరీశ్ రావు విమర్శించారు. అతి తక్కువ కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు.
కమిషన్ల ప్రాజెక్టులకు డబ్బులెక్కడివి:
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే 'నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు' అని చెప్పిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారు? ఫ్యూచర్ సిటీకి 20వేల కోట్ల టెండర్లు, ఒకవైపు కాళేశ్వరం కూలింది అంటూనే మల్లన్న సాగర్ నుంచి మూసీలో గోదావరి నీళ్లు పోసేందుకు రూ.7,000 కోట్ల టెండర్లు, జీహెచ్ఎంసీలో హైలెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు మరో ఏడు వేల కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రోడ్డు కోసం రూ.5 వేల కోట్ల టెండర్లు, హెచ్ఎండీఏ లో రూ.10,000 కోట్ల టెండర్లు, ఆర్ అండ్ బీ లో రూ.16 వేల కోట్ల టెండర్లు, గురుకులాలను గాలికి వదిలి, రూ. 25 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రూ.4,400 కోట్ల టెండర్లు, మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల టెండర్లు, కమిషన్లు దండుకునేందుకు రెండున్నర లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా? విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా? అని విమర్శించారు.
సిగ్గులేకుండా మాట తప్పారు:
ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో నేను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని, ఏ ఏడాదికి ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం సిగ్గులేకుండా మాట తప్పిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్ధిక మాంద్యాల్లోనూ ఫీజు రీయింబర్స్ మెంటు ఆపలేదన్నారు. చేతగాని విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు పెరిగారు అని పచ్చి అబద్ధం మాట్లాడారన్నారు. యూడైస్ రిపోర్ట్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 47 వేల మంది పిల్లలు తగ్గారన్నారు. ఒకవైపు కేసీఆర్ పై కక్షతో గురుకులాలను, మరోవైపు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా ఉన్నత విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి వచ్చినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమిషన్లు పొందడంపై ఉన్న చిత్తశుద్ధి ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడంపై లేదన్నారు. ఈ ప్రభుత్వానికి కమిషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస, విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై లేదన్నారు.






