రాష్ట్రంలో మరో భూకుంభకోణం.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-05 11:40:25  IST  )

నాదర్ గుల్ భూముల్లో రూ.7 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల భూములను దోచుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

రాష్ట్రంలో మరో భూకుంభకోణం.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఒకవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు. నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119) లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7 వేల కోట్ల రూపాయల భారీ స్కాం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‍‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఉన్నారని రక్షకులే భక్షకులుగా మారారని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే కన్ను:

నాదర్‌గుల్ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి APIIC కి అప్పగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములను కంటికి రెప్పలా కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రేవంత్ రెడ్డి కన్ను ఈ భూములపై పడిందన్నారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని ఈరోజు వాళ్లను భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లను, రౌడీలను పెట్టి పోలీసుల చేత దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కౌసల్య, మమత లాంటి మహిళా రైతులు 40 ఏళ్లుగా ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నారు. వారికి 5, 10 లక్షలు ఆశచూపి వెళ్లగొట్టాలని చూస్తున్నారు, బోర్లు, కంచెలు ధ్వంసం చేశారని ఆరోపించారు. మహిళలను రౌడీల చేత బెదిరిస్తున్నారు. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

సుప్రీంకోర్టు ఇదే చెప్పింది:

ఈ నాదర్‌గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతుండగా, 2005లోనే అప్పటి ఆర్డీవో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారని 2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదు. కానీ 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించాడు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్డీవో తేల్చిచెప్పారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా.. ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్ మరియు డివిజన్ బెంచ్ (13-10-2022న) స్పష్టం చేశాయన్నారు. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని గుర్తు చేశారు.

కాపాడాల్సిన ఆర్డీవో కళ్లు మూసుకున్నారు:

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద ఈ కేసు ఏప్రిల్ 7, 2026 విచారణకు పెండింగ్‍లో ఉందన్నారు. సుప్రీంకోర్టులో వాళ్లకు ఎలాంటి స్టే రాలేదు, కాబట్టి హైకోర్టు తీర్పే ఫైనల్. సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ ఇది ప్రభుత్వ భూమి అనే స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం భూభారతి వెబ్ సైట్ లో చూసినా ఇది ప్రభుత్వ భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్ గానే చూపిస్తోందని ఇంత స్పష్టంగా కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నప్పటికీ కస్టోడియన్‍గా ఉండి భూములను కాపాడాల్సిన ఆర్డీవో కళ్లు మూసుకున్నారని మండిపడ్డారు. మార్చి 9, 10 తేదీల్లో రైతులు కందుకూరు ఆర్డీవోకు, ఎమ్మార్వోకు, రంగారెడ్డి కలెక్టర్‌కు, చివరకు హైడ్రాకు కూడా గుండాల ఆక్రమణలపై వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

హైడ్రా కళ్లు మూసుకుందా?

ఆనాటి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తే.. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం గుండాలతో ఆ భూములను గుంజుకుంటోందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గుండాలు, రౌడీలు ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు వస్తున్నారు? దీని వెనుక ఉన్న దొంగలు ఎవరో స్పష్టమవుతోందన్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినా, పేద రైతులు వెళ్లి దరఖాస్తులు ఇచ్చినా హైడ్రా కళ్లు మూసుకుందంటే.. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా? శని, ఆదివారాలు వస్తే పేదల ఇళ్లు కూలగొట్టే జీవో 99 హైడ్రా.. 7 వేల కోట్ల భూ కుంభకోణాన్ని ఎందుకు ఆపడం లేదు? నేను చెరువులను కాపాడుతున్నానని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాదర్‌గుల్ కబ్జాలు కనిపించడం లేదా? ఆ 373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మ కుంట (FTL), 6 ఎకరాల బఫర్ జోన్ ఉంది. ఆ చెరువుకు వచ్చే ఫీడర్ ఛానల్స్ అన్నీ ఈ కంపెనీలు ధ్వంసం చేశాయన్నారు. లచ్చమ్మ కుంట నిండితే అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివాని కుంట, రెడ్డి కుంట, సున్నం చెరువు, చివరకు ఇంజాపూర్ మాసం చెరువు వరకు నీళ్లు వెళ్తాయి. ఇంత జరుగుతున్నా హైడ్రా రంగనాథ్ కు ఎందుకు వినిపించడం లేదు? రేపు ఉదయం కల్లా హైడ్రా రంగనాథ్ అక్కడకు వెళ్లి చర్యలు తీసుకోకపోతే.. ఎమ్మెల్యేలతో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అక్కడికి వెళ్తామన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న 80 నుంచి 100 ఎకరాల గుట్టలను 12 ఎకరాలు లింగమయ్య గుట్ట మినహా మిగతాదంతా మింగేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు:

ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు? ఈ కంపెనీల కబ్జాల వెనుక సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వాళ్లు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు పెడుతున్నారు. ముందు కోహినూర్ గ్రూప్ అని, తర్వాత శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ అని మార్చి మార్చి బోర్డులు పెడుతున్నారని ఆరోపించారు. కంపెనీస్ యాక్ట్ వెబ్ సైట్ ప్రకారం.. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ LLP లలో మంత్రి పొంగులేటి కొడుకు హర్షారెడ్డి, లోహిత్ రెడ్డి, స్వప్న రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కు కాంపౌండ్ వాల్ కోసం దరఖాస్తు చేసిన M/s AQ Square Realtors కు చెందిన క్రిస్టల్ మాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా హర్షారెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇది ముమ్మాటికీ మంత్రి పొంగులేటి కంపెనీయే అని స్పష్టమైందన్నారు. రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ కబ్జాల వెనుక ఉన్నప్పుడు ఆర్డీవో, హైడ్రా లాంటి చిన్న అధికారులు వారిని ఎలా అడ్డుకుంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి ఆ అక్రమ కాంపౌండ్ వాల్ ను కూలగొట్టాలన్నారు. ఆక్రమించిన వారిని అరెస్ట్ చేసి దొంగలు ఎవరో బయటపెట్టాలి. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులను తిరిగి ఆ భూముల్లోకి అనుమతించాలి.

పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు.. పార్టీ మార్పు ప్రచారాలపై ఈటల రాజేందర్ ఫైర్

Next Story