తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేద వైద్య విద్యార్థులకు ఇంగ్లీష్ శిక్షణ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో గత రెండేళ్లలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేద వైద్య విద్యార్థులకు ఇంగ్లీష్ శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత రెండేళ్లలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. వీటితో కలిపి మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 35కు చేరింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య 26గా ఉంది. అన్నింటా కలిసి సుమారు 9 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన పిల్లలు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఎస్సీ వర్గీకరణతో ఇంతకుముందు ఎన్నడూ పెద్దగా ఎంబీబీఎస్ సీట్లు సాధించని, పేద వర్గాల పిల్లలకు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. ఇలా పేద, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఇంగ్లీష్ భాష వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. వారికి పాఠాలు అర్థం కాకపోవడంతో ఒత్తిడికి లోను అవుతున్నారు. తోటి పిల్లలతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆత్మన్యూనత భావంతో విద్యను మధ్యలోనే ఆపేయడం, మంచి ట్యాలెంట్ ఉన్నప్పటికీ, కేవలం భాష పరమైన ఇబ్బందులతో మెడికల్ టెర్మినాలజీని అర్థం చేసుకోకపోవడం వల్ల, ఒత్తిడి వల్ల ఫెయిల్ అవడం వంటివి జరుగుతున్నాయి. ఈ బాధల నుంచి పిల్లలను రక్షించేందుకు వారికి స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి అధికారులకు ఈ సూచన చేశారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు ఇంగ్లీష్ క్లాసులు చెప్పించాలని, ఇందుకు అవసరమైన టీచర్లను నియమించాలని నిర్ణయించారు.

ప్రైవేటులలో విద్యార్థులపై ఫీజుల దోపిడీ..

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల నుంచి వచ్చే మెరిట్ పిల్లలు ఈ సీట్లను సాధిస్తున్నారు. పిల్లల కాలేజీ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. కానీ, హాస్టల్, మెస్, బుక్స్‌, లైబ్రరీ తదితర అవసరాల కోసం కన్వీనర్ కోటాలో చేరిన పిల్లలకు కూడా ఏటా లక్షల రూపాయల ఖర్చు వస్తోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రకరకాల పేర్లతో పిల్లల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల పేద, మధ్య తరగతి పిల్లలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది వారి చదువులపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, ప్రభుత్వం తరపున వారికి అవసరమైన సహాయం చేయడం ఎలా అన్న అంశాలను స్టడీ చేసి, రిపోర్ట్ ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ, హెల్త్ యూనివర్సిటీ వీసీని మంత్రి రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.

మెడికోలు ఆత్మహత్యలు చేసుకోకుండా...

దేశవ్యాప్తంగా మెడికోలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయని, ఇలాంటివి మన రాష్ట్రంలో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని, డల్‌గా ఉండే పిల్లలను గుర్తించి, వారి సమస్యలు ఏంటో తెలుసుకుని, పరిష్కరించే మెకానిజం అన్ని కాలేజీల్లోనూ డెవలప్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రత్యేక చర్యలకు మంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్‌, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్‌, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి గురువారం జరిగిన రివ్యూ మీటింగ్‌కు కొనసాగింపుగా, శుక్రవారం ఆరోగ్యశ్రీ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మీటింగ్‌కు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి హాజరయ్యారు.

Next Story