TG: సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇకపై ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి.

TG: సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇకపై ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేసేలా లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నేరుగా తెలుసునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందిరమ్మ ఇండ్లు పేరుతో ఉన్న వెబ్ సైట్ లో ఈ మేరకు మార్పులు చేసి, లబ్ధిదారుల వివరాలు, ఇండ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు స్థితిగతులు.. మొదలైన అన్ని వివరాలు కూడా తెలుసుకునే అవకాశం కల్పించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. ఈ సౌకర్యం వల్ల లబ్ధిదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు.

నాలుగు భాషల్లో అందుబాటులో..

ప్రజలకు భాషాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. వెబ్ సైట్ లో ఈ సమాచారాన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంచారు. దీంతో దీనిని వాడటం చాలా తేలికగా ఉండనుంది. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇండ్లను మంజూరు చేయగా, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇండ్ల మార్క్ అవుట్ దగ్గరి నుంచి పునాదులు, గోడలు, స్లాబ్ వేయడం వంటి నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగానే లబ్ధిదారులకు నాలుగు విడతలుగా రూ.5 లక్షల ఆర్థిక సాయం విడుదల చేస్తున్నారు.

లబ్ధిదారులకు తగ్గిన భారం..

తమ ఇంటి నిర్మాణ బిల్లు ఏ స్థాయిలో ఉన్నది? ఏ అధికారి వద్ద ఉన్నది? వంటి వాటితో పాటు ఇతరత్రా అనేక అంశాలపై లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్లు, కలెక్టరేట్, ఎంపీడీఓ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్ లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. తమ బిల్లు ఏ కారణం చేత, ఎందుకు ఆగిందన్న విషయం కూడా లబ్ధిదారులకు స్పష్టంగా తెలియడం వల్ల, వారు కూడా ఆయా లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.

చెక్ చేయడం ఇలా..

https://indirammaindlu.telangana.gov.in/ అనే వెబ్ సైట్ లో ‘అప్లికేషన్ సెర్చ్’ బటన్ పై క్లిక్ చేయాలి. అందులో ‘సెర్చ్ బై’ అనే దానిపై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ తదితర వాటిలో దేని ఆధారంగా సమాచారం కోరుకుంటున్నారో, ఆ వివరాల ఆధారంగా, పూర్తి సమాచారం స్క్రీన్ పై కనిపిస్తుంది. లబ్ధిదారుని పూర్తి వివరాలతోపాటు, ఇంటి నిర్మాణపు పనులు ఏ దశలో ఉన్నాయి? బిల్లుల చెల్లింపు ఏ తేదీన జరిగిందన్న వివరాలు కూడా కనిపిస్తాయి. అంతే కాకుండా, లబ్ధిదారులకు సంబంధించిన సమాచారంలో లోపాలుంటే, (ఉదా. ఆధార్ లోని పేరుతో లబ్ధిదారుని పేరు సరిపోలకపోవడం) ఆయా సందర్భాల్లో తీసిన ఫొటోలు సరిగా లేకపోవడం, బిల్లుల ఆమోదం ఏ అధికారి వద్ద ఉన్నది? మొదలైన అన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి. లబ్ధిదారుడికి ఇంతవరకు ఏ తేదీన ఎంత మొత్తం చెల్లించారనే వివరాలు కూడా ఇందులో చూసుకోవచ్చు. అందుబాటులో వచ్చిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగపర్చుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం సూచించారు.

Next Story