TG: ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు.. లీఫ్స్ సంస్థ కీలక కార్యక్రమం

by Gantepaka Srikanth |

దుక్కి దున్నే నాటి నుంచి పంట పండించిన పంటను మార్కెట్లో అమ్మే దాకా రైతులు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి.

TG: ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు.. లీఫ్స్ సంస్థ కీలక కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుక్కి దున్నే నాటి నుంచి పంట పండించిన పంటను మార్కెట్లో అమ్మే దాకా రైతులు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సవాళ్లకు తగ్గట్లుగా సాగు సాఫీగా సాగించేందుకు అమల్లో ఉన్న చట్టాలను రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో లీగల్ ఎంపర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ పార్మర్స్ సొసైటీ(లీఫ్స్) సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్రను చేపడుతున్నారు. బుధవారం రాయగిరి నుంచి జనగాం వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో రైతులకు అవసరమైన చట్టాలను అవగాహన కల్పించేందుకు తమ న్యాయవాదులు, లీఫ్స్ సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉంటారన్నారు. భూ సమస్య ఉత్పన్నమైనప్పుడు, నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు ఏం చేయాలి? మార్కెట్‌లో మోసపోయినప్పుడు, బీమా అందనప్పుడు రైతులు న్యాయం పొందేందుకు అమల్లో ఉన్న చట్టాలు తెలుసుకుంటేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. అవి ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తింపజేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో భూ చట్టాల నిపుణుడు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) సారధ్యంలో లీఫ్స్ సంస్థ సాగు న్యాయయాత్రను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 28 నుంచి అక్టోబరు 2 వరకు 800 గ్రామాల మీదుగా 2400 కి.మీ. పర్యటించారు. 10 వేల మంది రైతులను నేరుగా కలిసి కీలక వ్యవసాయ చట్టాలను వివరించారు. భూమి, విత్తనం, సాగునీరు, పంట రుణాలు, పంటల బీమా, వ్యవసాయ మార్కెట్ వంటి అనేక చట్టాలపై సరళమైన భాషతో ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లను రైతులకు అందిస్తూ అవగాహన కల్పించారు. ఒక రైతు తెలుసుకుంటే మరో పది మంది రైతులకు చెప్తారన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో భాగంగానే రైతుల న్యాయ అవసరాలపై లీఫ్స్ టీమ్ స్టడీ చేస్తున్నది. ఈ అధ్యయనం రైతులకు మెరుగైన ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి అధ్యయనం చేయడం, రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం.. రెండు వినూత్న ప్రయోగాలు దేశంలోనే మొదటి సారి అని భూమి సునీల్ పలుమార్లు ప్రకటించారు.

సాగు న్యాయయాత్ర రూట్:

రాయగిరి నుంచి ఆత్మకూర్– అడ్డగూడూరు– తిరుమలగిరి– కొడకండ్ల – దేవరుప్పల మీదుగా జనగాం వరకు.(భువనగిరి, సూర్యాపేట, జనగాం జిల్లాల పరిధిలో సాగుతుంది).

Next Story