TG: తెలంగాణలో మరో ఉప ఎన్నిక! కవిత రాజీనామాతో పొలిటికల్ హీట్

by Prasad Jukanti |

తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా/

TG: తెలంగాణలో మరో ఉప ఎన్నిక! కవిత రాజీనామాతో పొలిటికల్ హీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఉప ఎన్నిక ఊరిస్తోంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత (Kavitha) రాజీనామా చేయడంతో త్వరలోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయం అని తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత బీఆర్ఎస్ లో నెలకొన్న తాజా పరిణామాలతో పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శాసన మండలి కార్యాలయానికి పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. దీంతో కవిత రాజీనామా ఆమోదం పొందితే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక (By-Election) అనివార్యంగా మారనుంది.

ఓ వైపు జూబ్లీహిల్స్ మరో వైపు లోకల్ బాడీ మధ్యలో ఎమ్మెల్సీ ఖాళీ:

ప్రస్తుతం రాష్ట్రంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ బై పోల్ తప్పనిసరి అయింది. ఈ మేరకు ఎన్నిక నిర్వహణకు ఈసీ కసరత్తు వేగవంతం చేసింది. ఆలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో రిజర్వేషన్ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని అధికార పక్షం యోచిస్తోంది. ఈ రెండు ఎన్నికల చుట్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం నడుస్తున్న క్రమంలో కవిత రాజీనామా ఎపిసోడ్ పొలిటికల్ గా కాకరేపుతోంది. అయితే కవిత అభ్యర్థనను చైర్మన్ ఆమోదించినా ప్రస్తుతం స్థానిక సంస్థల్లో పాలక మండళ్లు లేనందునా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లు కొలువుదీరాకే ఈ బైపోల్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

బిగ్ ఫైట్:

కవిత పదవి కాలం 2028 జనవరి వరకు ఉంది. ఇంతలో ఆమె రాజీనామా చేయడం స్టేట్ పాలిటిక్స్ లో చర్చగా మారింది. బీఆర్ఎస్ పై పీకల్లోతు ఆగ్రహంతో రగిలిపోతున్న కవిత ఎమ్మెల్సీ స్థానానికి బై ఎలక్షన్ వస్తే ఆమె తిరిగి పోటి చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ బై పోల్ తన బలం బలం ఏంటో నిరూపించుకునేందుకు కవిత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ కవిత నేరుగా బరిలోకి దిగకపోయినా పరోక్షంగా కారు పార్టీని డ్యామేజ్ చేయడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గెలుపును సైతం నిర్ధారించబోతున్నందునా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే ఈ ఎన్నికతో పాటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పటికే ఒక ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర రాజకీయ చదరంగం రెడీ అవుతున్న తరుణంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బై పోలే వస్తే ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ గేమ్ మరింత రంజుగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

Next Story