ఏపీ సర్కార్ మరో బిగ్ ప్లాన్.. తెరపైకి పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్

by Kema Shiva Kumar |

మొన్నటి వరకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

ఏపీ సర్కార్ మరో బిగ్ ప్లాన్.. తెరపైకి పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి వరకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తాజాగా.. ‘పోలవరం-నల్లమలసాగర్’ లింక్ ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. అంతేకాకుండా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ను తయారు చేసేందుకు టెండర్ నోటీసును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ నోటీసును విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన విచారణలు నిర్వహించడం, అలాగే భారత ప్రభుత్వ సంస్థల నుంచి తప్పనిసరిగా పొందాల్సిన అన్ని చట్టబద్ధమైన క్లియరెన్స్‌లను సంపాదించడం వంటి పనులు ఇందులో ఉన్నాయి. ఈపీసీ టర్న్ కీ సిస్టమ్ పద్ధతిలో ఈ టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 21న ఈ టెండర్ నోటీసు జారీ చేయగా.. 12 నెలల టైం పీరియడ్‌తో రూ.7.68 కోట్లతో ఆహ్వానించారు. గురువారం నుంచి టెండర్ షెడ్యూల్ డౌన్‌లోడ్ ప్రక్రియను తెరువగా.. బిడ్ సబ్మిట్ చేసేందుకు వచ్చేనెల 11 వరకు అవకాశం కల్పించారు.

బనకచర్లకు బ్రేక్..

ఏపీ ప్రభుత్వం రూ.80 వేలకోట్లతో పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు నిర్మించాలని ముందుగా ప్లాన్ చేసింది. అయితే.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సర్వత్రా నిరసన తెలిపింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకొనేది లేదని, గోదావరిలో రాష్ట్ర వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకూడదని నిర్ణయించింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సీరియస్‌గా నిర్ణయం తీసుకొని ఆ దిశగా ముందుకు సాగింది. మరోవైపు కేంద్రంలోని కీలక మంత్రులను కలిసి విన్నవించడంతోపాటు సీడబ్ల్యూసీ దృష్టికి సైతం తీసుకెళ్లింది. స్వయంగా సీఎం రేవంత్‌‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ అక్రమ ప్రాజెక్టుకు పూర్తి అవగాహన కల్పించింది. అంతేకాకుండా.. కేంద్రానికి చివరకు అల్టిమేటం సైతం జారీ చేసింది. తెలంగాణను కాదని ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. దాంతో కేంద్రం సైతం ఈ విషయంలో వెనక్కి తగ్గింది. ముందుగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసిన పర్యావరణ అనుమతులను రిజెక్ట్ చేసింది. ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేది లేదని ఏపీకి స్పష్టం చేసింది.

తెర మీదకు కొత్త లింక్..

అయితే.. ఇప్పటివరకు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని అంతా భావించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం సైతం బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది. ఆ వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. దాంతో అంతా ప్రాజెక్టు ఇక పట్టాలెక్కదని భావించారు. కానీ.. ఏపీ మాత్రం ప్రాజెక్టును పేరును మార్చి కొత్త ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చింది. ‘పోలవరం-నల్లమలసాగర్’ లింక్ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధం అయింది. అవే గోదావరి నీటి వినియోగానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. అంతేకాకుండా తాజాగా టెండర్లను ఆహ్వానించింది. అయితే.. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సందర్భంలో ఏపీ ప్రభుత్వం కొత్త పేరుతో మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు ముందుగానే కేంద్రాన్ని అలర్ట్ చేశారు. ఏ పేరుతో వచ్చినా పర్మిషన్లు ఇవ్వరాదంటూ కోరారు. ఆయన విజ్ఞప్తి చేసిన నాలుగైదు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చి డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనా కొట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. మరోసారి.. ఏపీ నిర్ణయాన్ని తప్పుబడుతూ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఎట్టిపరిస్థితిల్లోనూ ఈ ప్రాజెక్టును సైతం అడ్డుకొని తీరుతామని చెబుతున్నారు.

Next Story