TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో భారీ శుభవార్త

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. పేదలు ఇల్లు నిర్మించుకోవడమే తమ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో భారీ శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. పేదలు ఇల్లు నిర్మించుకోవడమే తమ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం ఆయన హౌసింగ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారుకు ఇల్లు మంజూరై రూ.లక్ష పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేకుంటే తాము అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. అలాగే.. మహిళా సంఘాల ద్వారా ఎస్‌హెచ్‌జీ రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అలా రాష్ట్రవ్యాప్తంగా 21,993 మందికి రూ.237 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. ఒకవేళ లబ్ధిదారుకు ప్రత్యేకమైన కారణాలుంటేనే రద్దు చేయాల్సి ఉంటుందని.. ఈ మేరకు కలెక్టర్లకు సైతం మార్గదర్శకాలు జారీ చేశామని వెల్లడించారు. ఈ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ మొదలైందన్నారు. ఇల్లు మంజూరైనా ఇంకా గ్రౌండింగ్ కాని వారికే ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. 45 రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే రద్దు చేస్తామనేది కేవలం ప్రకటన వరకేనని.. ఎట్టిపరిస్థితిలోనూ క్యాన్సిల్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు.


ఆధార్ బేస్డ్ పేమెంట్స్

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ప్రక్రియను తీసుకొచ్చామని ఎండీ గౌతమ్ వెల్లడించారు. అంతకుముందు బ్యాంక్ అకౌంట్ ప్రాతిపదికన చెల్లింపులు జరిగేవని.. అవకతవకలు జరగకుండా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ సిస్టం తెచ్చామన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ద్వారా యూఐడీఏ లింకుతో నిధులను జమ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అకౌంట్ పేమెంట్స్ ద్వారా 20 శాతం రిజక్షన్ వచ్చేదని.. ఇప్పుడది ఒక్క శాతం మాత్రమే ఉన్నదని అన్నారు. ఆధార్ సీడ్ కాకపోవడం.. స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ ఉండడం వల్లనే ఈ సమస్య ఉన్నదని చెప్పారు. వాటిని అప్‌గ్రేడ్ చేసుకోవాలని లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్‌లు వెళ్తున్నాయని తెలిపారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే రూ.2,500 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా లబ్ధిదారులకు ఎక్కడా డబ్బులు ఆపకుండా.. ఆయా స్థాయిల్లో నిర్మాణాలు జరిగిన వెంటనే ప్రభుత్వం ఆదేశాల మేరకు బిల్లులు జమ చేస్తున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగానూ జీ+1కు అవకాశం

మరోవైపు.. ఈ స్కీములో ఇటీవల కొన్ని మార్పులు చేసినట్లు ఎండీ గౌతమ్ వెల్లడించారు. ముఖ్యంగా నగరాల్లో 400 నుంచి 600 ఎస్‌ఎఫ్‌టీలో ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాలు అందుబాటులో లేవని.. చిన్నచిన్న గుడిసెల్లో ఉన్నవారు ఉన్నారని తెలిపారు. వారి కోసం జీవో 69 తీసుకొచ్చి.. జీ+1 విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 30 గజాల్లో నిర్మించుకుంటే కింద 30 గజాలు.. పైన 30 గజాలు కలిపి 600 ఎస్‌ఎఫ్‌టీ వరకు అవుతుందని చెప్పారు. దాంతో నిబంధనలకు లోబడి నిర్మించుకోవచ్చని తెలిపారు. జీ+1కు సైతం విడతల వారీగా రూ.5 లక్షలు చెల్లిస్తామన్నారు. అయితే.. ఈ స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లోనూ ప్లేస్ తక్కువగా ఉన్న లబ్ధిదారులు జీ+1లో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని చెప్పారు.

అలాగే.. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఉపాధి, పీఎంఏవై స్కీములను సైతం అనుసంధానం చేసినట్లు తెలిపారు. దాంతో ఉపాధి నిధుల నుంచి లబ్ధిదారుకు రూ.3.80 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయని.. మిగితా రూ.1.20 లక్షలు కేంద్రం స్కీముల ద్వారా జమ అవుతాయని తెలిపారు. డేట్స్ తేడాతో యాడ్ అవుతాయని పేర్కొన్నారు. మరోవైపు.. లబ్ధిదారులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో రోజుకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఫిర్యాదులు వచ్చేవని.. ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి తగ్గిందని చెప్పారు. ఇప్పటివరకు లక్షకు పైగా ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 29వేలకు పైగా ఇళ్లు స్లాబ్ లెవల్ పూర్తయ్యాయని.. థర్డ్ స్టేజీ బిల్స్ పేమెంట్ అయ్యాయని చెప్పారు. ఇక నగరానికి సంబంధించి ముందుగా గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే.. అక్కడ స్కూల్స్ సమస్య ఉన్నదని లబ్ధిదారులు చెప్పడంతో అక్కడ స్కూల్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశించారని చెప్పారు. అలాగే.. మూసీ బాధితుల కోసం 1,500 డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. అలాగూ.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇసుక సమస్య రాకుండా త్వరలోనే సాండ్ టాక్స్ యాప్ తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ సీఈ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Next Story