హరీశ్‌రావును గల్ఫ్ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి: అనిల్ ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

హరీశ్‌రావును గల్ఫ్ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీశ్‌రావును గల్ఫ్ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి: అనిల్ ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న (Gulf workers) గల్ఫ్ సంక్షేమ కార్యక్రమాలపై అబద్దాలు ఆడుతున్న హరీశ్‌రావును గల్ఫ్ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి (Anil Kumar Eravathri) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు వేల మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని ఆరోపించారు. పదేళ్లలో ఏనాడు గల్ఫ్ కార్మికులు మీకు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల పాలిట కేసీఆర్ ఒక నరరూప రాక్షసుడని, కేటీఆర్, కవిత, హరీశ్ చిన్న రాక్షసులని అనిల్ ఫైర్ అయ్యారు.

ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ వినోద్ కుమార్ ప్రశ్నించారు. బొగ్గుబాయి - బొంబాయి - దుబాయ్ అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో.. వలస కార్మికులను రెచ్చగొట్టి వాడుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేసి, నట్టేట ముంచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు అన్నారు.

గల్ఫ్ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీశ్‌రావులు మాట తప్పారని కమిటీ సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ అయిదుగురూ ‘గల్ఫ్ ద్రోహులు’ గా చరిత్రలో నిలిచిపోయారని మండిపడ్డారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావు గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని, ప్రవాసీ ప్రజావాణిని సందర్శించాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలోని రెండు వేల మంది గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల చొప్పున వంద కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ నిధుల నుండి చెల్లించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, ఫిర్యాదుల స్వీకరణకు 'ప్రవాసీ ప్రజావాణి' ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు, సమగ్ర ఎన్నారై పాలసీ రూపకల్పన కొరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ 'గల్ఫ్ భరోసా' సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక హరీశ్‌రావు అబద్దాలు మాట్లాడుతున్నారని వారు అన్నారు.

Next Story