- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత భవనాలు లేని అంగన్వాడీలు.. ఉచిత విద్యుత్ ప్రకటన గాలిలోనే
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయసున్న పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య..

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయసున్న పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య నేర్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ అనేక కేంద్రాల్లో సమస్యలు తిష్ట వేశాయి. కనీస సౌకర్యాలు లేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో చిన్నారులు, గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రాష్ర్టంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 12,248 కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇది అంగన్వాడీ సేవలు పొందుతున్న లక్షలాది మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతల భద్రత, సౌకర్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని గ్రామాల్లో కొన్నేళ్ల కిందట భవనాలకు నిధులు మంజూరైనా నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో స్థల కేటాయింపు సమస్య కారణంగా సొంత భవనాలకు నోచుకోవడం లేదు.
రాష్ట్రంలో 35,700 సెంటర్లు
రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో మినీ అంగన్వాడీలు 3989, ప్రధాన కేంద్రాలు 31,711 ఉన్నాయి. రాష్ట్రంలో 11,843 అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. ఇంకా 11,690 కేంద్రాలు అద్దె లేకుండా ఇతర ప్రభుత్వ భవనాలు లేదా సమీప ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లలో నమోదు చేసుకున్న గర్భిణులు 1,72,090, చిన్నారులు 15,18,813 ఉన్నారు.
ప్రమాదకర పరిస్థితులు
ప్రభుత్వం ప్లే స్కూల్, ప్రీ ప్రైమరీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అసలు సొంత భవనాలే లేని అంగన్వాడీ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. అద్దె భవనాల్లోని చాలా కేంద్రాలకు సరైన సౌకర్యాలు లేవని, ఇరుకు గదులు, సరైన పారిశుధ్యం లేకపోవడం, ఆరుబయట ఆట స్థలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కేంద్రాలు నడుపుతూ చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రస్తుత అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని వివిధ సంఘాలు, ప్రజా ప్రతినిధులు గతంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయి.
అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రీ కరెంట్ ఎప్పుడు?
అంగన్వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రకటన చేసింది. కానీ ఇంతవరకు అందుకు సంబంధించిన జీవో జారీ చేయలేదు. అయితే ఆ ఉత్తర్వులు విడుదల చేసేందుకు ఎనర్జీ శాఖ చొరవ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీలను పర్యవేక్షిస్తోన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి మూడు నెలల క్రితమే ప్రపోజల్స్ ఎనర్జీ శాఖకు పంపినట్లు తెలిసింది. కానీ ఆ ఫైల్‌ను అధికారులు క్లియర్ చేయకపోవడంతో పెండింగ్‌లో పడింది. ఆలస్యం అవుతుండటంతో ఆ స్కీమ్‌ను అమలు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రాష్ర్టంలోని దాదాపు 21 వేల సెంటర్లకు పవర్ కనెక్షన్ లేదు. ఇప్పటికే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలుతో ఎనర్జీ శాఖపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదని, అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రీ పవర్ వల్ల మరింత భారం పడుతుందన్న ఉద్దేశంతో ఫైల్ పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది.






