- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి
డ్రగ్స్, గంజాయి ముఠాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి.. అక్రమార్కులు ఎంతటివారైనా చట్టం ముందు మోకరిల్లేలా పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

దిశ, గండిపేట: డ్రగ్స్, గంజాయి ముఠాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి.. అక్రమార్కులు ఎంతటివారైనా చట్టం ముందు మోకరిల్లేలా పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఎక్సైజ్ శాఖ ఆదాయ శాఖ మాత్రమే కాదు.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే శాఖ అని, యూనిఫాం ఒక హోదా కాదు.. కోట్లాది ప్రజల నమ్మకానికి ప్రతీక అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎక్సైజ్ శాఖ యువ అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బండ్లగూడ జాగీర్‌లోని ఎక్సైజ్ అకాడమీలో గురువారం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ, కర్తవ్యనిష్ఠ, నిజాయితీని తమ సేవా జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఆరు నెలల కఠోర సంస్థాగత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 28 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు కలిపి మొత్తం 117 మంది అధికారులు దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో 33 మంది మహిళా అధికారులు ఉన్నారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మద్యనిషేధ, ఎక్సైజ్ శాఖ కేవలం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖ మాత్రమే కాదని, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడటం, సమాజాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించే అత్యంత కీలకమైన విభాగమని మంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు నాటుసారా, గుడుంబా, దేశీదారు, కల్తీ కల్లు ప్రధాన సవాళ్లుగా ఉండేవని, ప్రస్తుతం గంజాయి, సింథటిక్ డ్రగ్స్, నార్కోటిక్ నెట్‌వర్క్‌లు, ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న అక్రమ వ్యాపారాలు కొత్త సవాళ్లుగా మారాయని తెలిపారు. డ్రగ్స్ అనేవి కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసి యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక విపత్తని పేర్కొన్నారు. అధికారులు స్వాధీనం చేసుకునే ప్రతి డ్రగ్స్ ప్యాకెట్ వెనుక ఒక యువకుడి భవిష్యత్తు ఉంటుందని, వారి విధులు కేసుల నమోదు వద్ద ముగియవని, సమాజాన్ని రక్షించడంలో ప్రారంభమవుతాయని అన్నారు.
సాంకేతికతే అతిపెద్ద ఆయుధం
ప్రస్తుత కాలంలో నేరగాళ్లు సాంకేతికతను వినియోగించి కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారని, వారిని ఎదుర్కోవడానికి అధికారులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నాయని తెలిపారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా గంజాయి సాగు, అక్రమ సారా కేంద్రాలను గుర్తించడం, మొబైల్ యాప్స్, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా రవాణాను పర్యవేక్షించడం, సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ ద్వారా డ్రగ్ నెట్‌వర్క్‌లను ముందుగానే పసిగట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో కూడా అంతర్జాతీయ స్థాయి నిఘా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
డ్రగ్స్‌పై నిర్దాక్షిణ్య పోరు అవసరం
డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమార్కులు ఎంతటివారైనా చట్టం ముందు మోకరిల్లేలా కర్తవ్య నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.
సౌమ్య సాహసం స్ఫూర్తిగా తీసుకోవాలి
క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకత, ప్రజాసేవా దృక్పథమే అధికారుల అసలు గుర్తింపుగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. అక్రమ మద్యం తయారీ, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడం ద్వారా తెలంగాణను మరింత సురక్షితమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. నిజామాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ సౌమ్య ధైర్యసాహసాలు కొత్త అధికారులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ ఖురేషీ, అకాడమీ డైరెక్టర్ సురేష్, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, జాయింట్ డైరెక్టర్ శశిధర్‌రెడ్డి, చీఫ్ డ్రిల్ ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






