అమ్మకు అక్షరమాల గ్రాండ్ సక్సెస్.. పరీక్షలో 83.3 శాతం మహిళలు ఉత్తీర్ణత

by Ramesh Naini |

నిరక్షరాస్యత నిర్మూలన, మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది.

అమ్మకు అక్షరమాల గ్రాండ్ సక్సెస్..  పరీక్షలో 83.3 శాతం మహిళలు ఉత్తీర్ణత
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరక్షరాస్యత నిర్మూలన, మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. మహిళా స్వయం సహాయక సంఘాల నిరక్షరాస్య సభ్యులకు అక్షరాస్యతను అందించాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఫలితాలను అందించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో హాజరైన మహిళల్లో 83.3 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం కార్యక్రమం విజయానికి నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది మహిళలకు అక్షరాస్యత బోధన అందించగా, వారిలో 6 లక్షల 12 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన వారిలో 5 లక్షల 10 వేల మందికి పైగా మహిళలు ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయంతో లక్షలాది మంది మహిళలు ఇకపై పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హత పొందారు. దీంతో వారి విద్యాభ్యాసానికి కొత్త మార్గాలు తెరుచుకున్నాయి.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పందిస్తూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం విజయం మాత్రమే కాదని, రాష్ట్ర మహిళల సంకల్పం, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అన్నారు. అక్షరాస్యత సాధించడం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కుటుంబాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని మంత్రి తెలిపారు. చదువు లేక ఎన్నో అవకాశాలను కోల్పోయిన మహిళలకు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం కొత్త జీవితాన్ని అందించిందని పేర్కొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మహిళలు అక్కడితో చదువును ఆపకుండా పదో తరగతి, ఇంటర్మీడియట్ తదితర ఉన్నత విద్యను కొనసాగించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ఉత్తీర్ణులైన మహిళలను తదుపరి విద్యా కార్యక్రమాల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా నిరక్షరాస్యురాలిగా మిగలకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

Next Story