Amit Shah: అందుకోసమే దక్షిణ వ్యక్తికి ఉపరాష్ట్రపతి అవకాశం.. అమిత్ షా నోట నార్త్, సౌత్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-08-25 07:00:05  IST  )

నైతికత గురించి రాహుల్ చెప్పడమేంటని అమిత్ షా ఫైర్ అయ్యారు

Amit Shah: అందుకోసమే దక్షిణ వ్యక్తికి  ఉపరాష్ట్రపతి అవకాశం.. అమిత్ షా నోట నార్త్, సౌత్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice President Election) అంశం ఆసక్తిగా మారింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దక్షిణ భారత దేశానికి (South India) చెందిన వ్యక్తిని తమ అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయ చర్చకు దారి తీసింది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎన్డీయే ఈ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన అమిత్ షా.. రాష్ట్రపతి తూర్పు భారతం నుంచి ఉన్నారు.. ప్రధాన మంత్రి పశ్చిమం వైపు నుంచి ఉన్నారు.. ఉత్తరం వైపు నుంచి కూడా నాయకత్వం ఉంది. కాబట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణం నుంచి రావడం సహజమే అన్నారు. దీన్ని ఎన్నికల కోణంలో చూడకూడదన్నారు. సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్తావన కలిగిన వారు అని ఆయన బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చెరి, మహారాష్ట్ర స్టేట్స్ కు గవర్నర్ గా సేవలు అందించారన్నారు. ఇక మాజీ ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ అంశంపై స్పందించిన ఆయన ధన్ ఖడ్ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన తన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారన్నారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దన్నారు. ధన్ ఖండ్ గృహ నిర్బంధంలో ఉన్నారని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను అమిత్ షా ఖండించారు.

నాడు రాహుల్ గాంధీ చేసిందేమిటి?:

130 రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో విపక్షాల తీరును అమిత్ షా తీవ్రంగా ఖండించారు. 2013లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఏం చేశారు అంటూ నాటి ఉదంతాన్ని షా గుర్తు చేశారు. నాడు లాలూ యాదవ్ ను కాపాడేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పత్రాలను రాహుల్ గాంధీ చింపేశారని ఆరోజే ఆయన నైతికతతో వ్యవహరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలు అవుతుందని ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోడీనే దీన్ని సవరణలో చేర్చారన్నారు. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రైనా, ప్రధాని అయినా జైలు నుంచి పరిపాలన చేయడం మంచి విషయమేనా అని అమిత్ షా ప్రశ్నించారు.

Next Story