- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి: మంత్రి లక్ష్మణ్ కుమార్
డా. బీ.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .

దిశ, తెలంగాణ బ్యూరో : చిన్న రాష్ట్రాల ఏర్పాటు దేశాభివృద్ధికి దోహద పడుతుందన్న అంబేద్కర్ పేర్కొన్న సిద్దాంతం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు దొరల, నియంతృత్వ పాలనకు ముగింపు పలికి మార్పు కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో దళిత వర్గాల నాయకులకు పెద్దపీట వేస్తున్నామని, తాను ఒక సాధారణ కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని, ఇదే నిదర్శనమన్నారు. మంగళవారం డా. బీ.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. తెలంగాణలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 25 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు.
ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా దళిత విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబర్చి ఐఏఎస్, ఐసీఎస్ తో పాటు గ్రూప్-1, 2, 3, 4 వంటి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారని మంత్రి కొనియాడారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణ పాఠ్యాంశాల్లో అంబేద్కర్ చరిత్రను చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లు మాట్లాడారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ దళిత జాతులకు చెందిన సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కొమ్ము నాట్యం, డప్పు కళాకారుల ప్రదర్శనలు, మాదిగ దండోరా, బుర్రకథ, ఓగుడు, జాంబపురాణం వంటి ఎస్సీ కమ్యూనిటీ కళలు, వాటి వైవిధ్యభరిత రూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, పల్లె నర్సింహులు, 57 ఉపకులాల సాంస్కృతిక కళారూపాలు ఆటపాటలతో సభను ఉత్సాహభరితంగా మార్చాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఎన్ఎస్ స్థాపకులు బైరీ నరేష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను పఠించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోనే తొలి అంబేద్కర్ మ్యూజియంను కూడా సందర్శించారు.






