జేఈఈ మెయిన్–2026 పరీక్షల్లో తెలంగాణ గురుకుల విద్యార్థుల అద్భుత ప్రతిభ

by Ramesh Naini |

జేఈఈ మెయిన్–2026 మొదటి విడత పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అధికారులు తెలిపారు.

జేఈఈ మెయిన్–2026 పరీక్షల్లో తెలంగాణ గురుకుల విద్యార్థుల అద్భుత ప్రతిభ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జేఈఈ మెయిన్–2026 మొదటి విడత పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన విద్య అవకాశాలు సమర్థంగా వినియోగించుకుంటూ, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోమని సీఓఈ విద్యార్థులు మరోసారి నిరూపించారన్నారు. గౌలిదొడ్డి సీఓఈ కాలేజ్ నుంచి వై. నవదీప్ 98.39 పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలువగా, సత్య స్వరూప్ 97.99, యశ్వంత్ 95.70, ఎం. మహేష్ 95.18, ఎస్. రాజు 94.83 పర్సంటైల్‌లు సాధించారని, గౌలిదొడ్డి బాలికల సీఓఈ నుంచి కే. శ్రీ వర్ష 94.64, వి. మంజుల 92.25 పర్సంటైల్‌లు సాధించి విశేష ప్రతిభను ప్రదర్శించారని కృష్ణ ఆదిత్య చెప్పారు. మారుమూల ప్రాంతంలో ఉన్న వనపర్తి జిల్లా మదనాపురం సీఓఈ నుంచి పి. సూర్యనారాయణ అనే విద్యార్థి 94.03 పర్సంటైల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారన్నారు.

26 మంది విద్యార్థులు 90 పర్సంటైల్‌

సీఓఈ కేంద్రాల నుంచి మొత్తం 26 మంది విద్యార్థులు 90 పర్సంటైల్‌కు పైగా, 109 మంది విద్యార్థులు 80 పర్సంటైల్‌కు పైగా, 236 మంది విద్యార్థులు 70 పర్సంటైల్‌కు పైగా ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కట్‌ఆఫ్‌ను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా 337 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్–2026 పరీక్షకు అర్హత సాధించినట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ సహకారం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కృష్ణ ఆదిత్య తెలిపారు. రాబోయే జేఈఈ మెయిన్ రెండో విడత, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేలా ఇంకా శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి సహకరించిన బోధనా సిబ్బందిని, సంబంధిత ప్రధానాచార్యులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. గురుకులాల్లో విద్యా ప్రమాణాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story