అమరజ్యోతికి కొత్త రూపు.. అమరవీరుల కుటుంబాల కోసం గ్రీవెన్స్ సెల్

by Naga Rani Yarlagadda |

త్వరలో అమరవీరుల స్మారకం అమరజ్యోతి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

అమరజ్యోతికి కొత్త రూపు.. అమరవీరుల కుటుంబాల కోసం గ్రీవెన్స్ సెల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో అమరవీరుల స్మారకం అమరజ్యోతి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అక్కడ ‘అమరవీరుల కుటుంబాల గ్రీవెన్స్ సెల్’ ను ఏర్పాటు చేసి,వారి సాధాకబాధకాలు వినడం, పరిష్కారం చూపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సుమారు రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించిన అమరజ్యోతి నిరుపయోగంగా ఉంది. ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అయితే బీఆర్ఎస్ హాయంలో నిర్మించిన అమరజ్యోతిలో రెస్టారెంట్ ఏర్పాటు కోసం డిజైన్ చేశారు. కాని కాంగ్రెస్ సర్కారు మాత్రం అమరవీరుల త్యాగాలు భవిష్యత్ తరాలకు అందివిధంగా అమరజ్యోతిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

అమరవీరుల కుటుంబాలకు కేరాఫ్ అమరజ్యోతి

ఇప్పటివరకు ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాల సమస్యలను వినేందుకు ప్రత్యేకంగా ఓ విభాగం లేదు. దీనితో బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు మంత్రుల వద్దకు వెళ్లడమో లేకపోతే ప్రజావాణి పొగ్రామ్ కు వెళ్లి తమ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. వాటిని బాధితులే మళ్లీ ఫాలోఆఫ్ చేసుకుంటున్నారు.అవి పరిష్కారం అవుతాయోలేదోనని తెలియని పరిస్థితి ఉంది. దీనితో సమస్యల పరిష్కారంలో కాలయాపన జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఆ లోటును పూడ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమరజ్యోతి కేంద్రంలో ‘అమరవీరుల కుటుంబాల గ్రీవెన్స్ సెల్’ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుతెలిసింది. సెల్ కు వెళ్లి బాధితులు తము ఎదుర్కుంటోన్న ఆరోగ్య సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పిల్లల ఉన్నత చదవుల కోసం ఆడ్మిషన్లు, పెన్షన్ సమస్యలు, ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాల్లో ఆలస్యం జరిగితే వాటిని కూడా సెల్ లోని అధికారుల దృష్టికి తీసుకెళ్లేవిధంగా ఏర్పాట్లు చేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ నోడల్ ఎజెన్సీని ఏర్పాటు చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అసలైన ఉద్యమ చరిత్రతో డాక్యుమెంటరీ

బీఆర్ఎస్ హాయంలో అమరజ్యోతి కేంద్రంలో తెలంగాణ ఉద్యమ చరిత్రపై 20 నిమిషాల నిడివితో ఓ డాక్యుమెంటరీ తయారు చేశారు. కాని ఆ డాక్యుమెంటరీలో కొందరు వ్యక్తులను ఫోకస్ గా చేస్తూ తయారు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అందుకని రాష్ట్రసాధన కోసం తొలి,మలి ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు,పోరాటాలు చేసిన వ్యక్తుల అందరికి సమాన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా డాక్యుమెంటరీ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే అక్కడ ఏర్పాటు చేస్తోన్న ఫోటో ఎగ్జిబిషన్ లో సైతం అమరుల అందరికి ప్రాధాన్యత కల్పించేవిధంగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటంబాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాలు సైతం అక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story