‘వాళ్లను ట్రోల్ చేయడం ఇక ఆపేయండి’.. అభిమానులకు అల్లు అర్జున్ సూచన

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశం కోలాహలంగా జరిగింది.

‘వాళ్లను ట్రోల్ చేయడం ఇక ఆపేయండి’.. అభిమానులకు అల్లు అర్జున్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా హాజరై, అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివిటీ, అనవసరపు వివాదాల గురించి ప్రస్తావిస్తూ ఆయన అభిమానులకు పలు కీలక సూచనలు చేశారు.

ట్రోలింగ్‌‌కు దూరంగా ఉండండి..

సోషల్ మీడియాలో సాగే దుష్ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లను పట్టించుకోవద్దని బన్నీ కోరారు. "మీకు ఎవరైనా నచ్చకపోతే సింపుల్‌గా వాళ్లను వదిలేయండి. అంతేకానీ పదే పదే వాళ్లను ట్రోల్ చేయడం, వాళ్లపై ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి ఏమాత్రం మంచిది కాదు" అని స్పష్టం చేశారు. అభిమానులు తమ సమయాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును నెగెటివిటీ కోసం వృథా చేసుకోవద్దని అల్లు అర్జున్ హితవు పలికారు. "మీ శ్రమ, సమయం చాలా విలువైనవి. మీ ప్రతి రోజూ ఎనర్జీని మీ ఎదుగుదల కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలకు సమయాన్ని కేటాయించకండి" అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు పాల్గొనగా, తమ అభిమాన కథానాయకుడు ఇచ్చిన సందేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Next Story