- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్‌కి దొరికిన లంకెబిందెలు.. భారీ ల్యాండ్ స్కామ్‌కు తెర : ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి లంకెబిందెలు దొరికాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి లంకెబిందెలు దొరికాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడలకు చెందిన 9,292 ఎకరాల భూములను ఇక నుంచి మల్టీ యూజ్ జోన్లుగా కన్వర్షన్ చేస్తూ ప్రభుత్వం జోవో-27 ను జారీ చేయడం ల్యాండ్ లూటింగ్ పాలసీ అని మండిపడ్డారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు 30 శాతం పోగా మిగిలిన 6,510 ఎకరాలను గజాల చొప్పున విక్రయిస్తే రూ .6 లక్షల 29 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు. అలాంటి విలువైన భూములను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ విలువలో 30 శాతానికే మల్టీ యూజ్ జోన్లుగా మార్చుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా రేవంత్ సర్కార్ అతి పెద్ద కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పాలసీతో వచ్చే రాబడితో రాష్ట్రానికి ఉన్న అప్పులు అన్నింటినీ తీర్చవచ్చన్నారు. నిర్మాణాలు చేపడితే అంతకు రెట్టింపు లాభం ఉంటుంది. ముఖ్యమంత్రి తాను లక్షల కోటీశ్వరుడు కావాలనే స్వార్ధంతో, మంత్రులు తాము వేల కోటీశ్వరులు కావాలనే స్వార్ధంతో పాలసీని ఆదరాబాదరగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ పాలసీని అమలు చేయడానికి వీలు లేదన్నారు.
అసెంబ్లీలో చర్చించిన తర్వాతే పారిశ్రామిక పాలసీని అమలు చేయాలని, అప్పటి వరకు పెండింగ్‌లో పెట్టాలని డిమాండ్‌చేశారు. దీనిపై ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్టు పాలసీని మంత్రులకు సర్కులేట్ చేసి, వారు చదివాక మళ్లీ వెనక్కి తీసుకున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంత పకడ్బందీగా రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి తెర లేపినట్ల స్పష్టమైతుందని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెరో రూ.50వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రూ.30 వేల కోట్లు ముట్టనున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు రెండేండ్లు పూర్తి చేసుకున్నాక హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేసి మరో కీలక నేతను ముఖ్యమంత్రిని చేస్తుంది. ఇపుడు రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీని కాపాడుకునేందుకు ఈ భారీ ల్యాండ్ స్కాముకు తెరతీసి గాంధీ కుటుంబానికి రూ.లక్ష కోట్లు ముడుపులు ఇవ్వనున్నారు. గతంలో కేసీఆర్ ఇక తనకు తెలంగాణలో తిరుగలేదని భావించి టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేయాలని చూసి భంగపడ్డారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న తర్వాత దేశ రాజకీయాలపై కన్నేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్లకే ఆ పని చేస్తున్నారు. పారిశ్రామిక పాలసీ స్కాము ద్వారా కొల్లగొట్టే కోట్లతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో పెత్తనం చేయాలనేది రేవంత్ రెడ్డి స్కెచ్ అని తెలిపారు.
గొర్రెలను తినేటోడు పోయి బర్రెలను తినేటోడు వచ్చాడు..
రేవంత్ సర్కార్ చేస్తున్న ల్యాండ్ స్కామునే గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అంగీకరించారన్నారు. అజామాబాద్, కూకట్‌పల్లి, హఫీజ్‌పేటలోని పారిశ్రామిక భూములకు ఫ్రీ హోల్డ్ పేరిట బీఆర్‌ఎస్ ప్రభుత్వమే యాజమాన్య హక్కులు కల్పించిందని వెల్లడించారు. బీఆర్ఎస్ సర్కారు ఇలా ఫ్రీ హోల్డ్ పేరిట ఎకరాకు రూ.50 నుంచి రూ.60 కోట్లకు ఉన్న విలువైన భూములను ఎకరాకు రూ.10 కోట్లకే కట్టబెట్టారని, ఇలా వందల కోట్ల ప్రభుత్వ భూములను అప్పటి మంత్రి కేటీఆర్ తన వారికి అప్పనంగా కట్టబెట్టి ప్రజాధనాన్నికొల్లగొట్టారని శ్రీధర్ బాబు ఆరోపించారన్నారు. అంటే అపుడు బీఆర్ఎస్ సర్కార్ భూ దోపిడీకి పాల్పడిందని, ఇపుడు తాము చేస్తే తప్పేంటనే ధోరణిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని ఏలేటీ విమర్శించారు.






