మెట్రో రైల్ స్వాధీనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్‌తో L&T చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ భేటీ

by Kema Shiva Kumar |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ భేటీ అయ్యారు.

మెట్రో రైల్ స్వాధీనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్‌తో L&T చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టు అధికారికంగా ప్రభుత్వ పరం కాబోతోంది. ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ నుంచి మెట్రో వాటాలను కొనుగోలు చేసే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం నేపథ్యంలో ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఇవాళ స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఇరువురు మెట్రో బదిలీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఎల్ అండ్ టీ కంపెనీ ఇన్నాళ్లుగా నిర్వహించిన ఆపరేషన్స్, భవిష్యత్తులో రెండో దశ మెట్రో పనుల్లో ఆ కంపెనీ భాగస్వామ్యంపై కూడా ప్రాథమికంగా డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఒప్పందం సిద్ధం.. బోర్డు ఆమోదం

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) స్వాధీన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం కీలక బోర్డు సమావేశం జరిగింది. ఈ భేటీలో మెట్రో వాటాల కొనుగోలు ఒప్పందానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వాటా కొనుగోలు ఒప్పందం (Share Purchase Agreement) సిద్ధమైంది. ప్రస్తుతం ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్రో ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియకు ఏప్రిల్ 30వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ గడువు సమీపించడంతో మెట్రో రైలు ప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. టెక్నికల్, ఫైనాన్షియల్ అంశాలను క్లియర్ చేసేందుకు అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. నేడో, రేపో ఈ ప్రక్రియ అధికారికంగా ముగిసి, మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.

కాగా, వాస్తవానికి మార్చి 31ని మెట్రో స్వాధీన తేదీ అనుకున్నప్పటికీ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (IRFC) నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్‌ 30కి పొడిగించారు. ఈ తేదీ నాటికి ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు లిమిటెడ్‌ అప్పు రూ.13,615 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి 3.5 నుంచి 4 శాతం వడ్డీకి తీసుకుని రుణాలను రీషెడ్యూల్‌ చేయనుంది. మిగిలిన రూ.1,385 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఈక్విటీగా ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం చెల్లించనుంది. దీనికి సంబంధించి కీలకమైన వాటా కొనుగోలు ఒప్పందంపై సీఎం సమక్షంలో అధికారులు సంతకాలు చేయనున్నారు. దీంతో పీపీపీలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ ప్రభుత్వ పరం కానుంది. అన్నీ అనుకూలిస్తే బుధ లేదా గురువారాల్లో ఒప్పందాలపై సంతకాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.

Next Story