- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిల్ట్‌పై అఖిలపక్షాన్ని వేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని 22 పారిశ్రామిక కేంద్రాల్లోని పరిశ్రమలన్నింటినీ నగరం బయటికి తరలించేందుకు జీవో నంబర్ 27ను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని 22 పారిశ్రామిక కేంద్రాల్లోని పరిశ్రమలన్నింటినీ నగరం బయటికి తరలించేందుకు జీవో నంబర్ 27ను విడుదల చేసింది. దీని కోసం 9300 ఎకరాల భూమిని అతి తక్కువ ధరలకే పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు జరుగుతున్నాయి. కన్వర్షన్ పేరుతో రియల్ ఎస్టేట్‌కు కట్టబెడతారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల సౌకర్యాల కోసం, ఇంటి స్థలాలు, క్రీడా స్థలాలు, స్కూళ్ళు, హాస్టల్స్ కోసం కేటాయించవచ్చు. వేలాది ఎకరాలు, లక్షల కోట్లకు సంబంధించిన అంశంపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలను నగరం నుండి తరలించాలి తప్ప, మిగతా పరిశ్రమలనన్నింటిని ఎందుకు తరలిస్తున్నారు? పరిశ్రమలు తరలిస్తే కార్మికుల పరిస్థితి, వారి భధ్రతకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? వాళ్ళకు అక్కడ నివాసం, విద్యా, వైద్యం, ఉపాధి పరిస్థితులు ఏంటీ? పరిశ్రమలను బయటికి తరలిస్తే, ఈ భూములను ఆ పారిశ్రామిక వేత్తలకే మార్కెట్ ధరకు కాకుండా, అతి తక్కువ ధరకే ఎందుకివ్వాలి? ప్రభుత్వం కేటాయించిన భూముల్లో మూతపడిన పరిశ్రమలు ఎన్ని? ఆ భూములు ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? నగరంలో విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడమే. ఇదొక హిల్ట్ స్కామ్‌లా మారే పరిస్థితి కన్పడుతున్నది’ అని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ కూడా చేసిందని కాంగ్రెస్ వారు అంటున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినా, అది బీజేపీ ప్రభుత్వం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి తప్ప, ప్రజల ప్రయోజనాల పేరుతో పారిశ్రామిక వేత్తలకో, రాజకీయ నాయకులకో అప్పగించే పద్ధతులను పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై నిర్ధిష్టమైన వివరాలు ప్రజలముందు ఉంచాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.






