- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి 23 నుండి హైదరాబాద్‌లో అఖిలభారత పోలీస్ ఫుట్ బాల్
74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని డీజీపీ బి శివధర్ రెడ్డి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని డీజీపీ బి శివధర్ రెడ్డి వెల్లడించారు. పోలీస్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ నిర్వహణపై డీజీపీ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ శాఖ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహించనున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 11 కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, 6 కేంద్ర పోలీస్ సంస్థల నుంచి మొత్తం 53 జట్లు ఈ క్రీడా సమరంలో పాల్గొంటాయని తెలిపారు. సుమారు 1060 మంది పురుష క్రీడాకారులు, 350 మంది మహిళా క్రీడాకారులు, కోచ్‌లు, రిఫరీలు, ఇతర అధికారులతో కలిపి మొత్తం 2వేల మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకలో భాగస్వాములు కాబోతున్నారన్నారు. మొత్తం 12 రోజుల పాటు సాగే ఈ ఛాంపియన్‌షిప్‌లో 125 మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, అజీజ్ నగర్‌లోని ఎచ్‌ఎఫ్‌సి గ్రౌండ్, మోయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ మైదానాలతో పాటు మరికొన్ని ప్రధాన మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయన్నారు.
ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు చైర్మన్ డీజీపీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం. రమేష్ , అడ్మినిస్ట్రేషన్ కమిటీలో ఐపిఎస్ అధికారులు అభిలాషా బిస్త్, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, వి.సి. సజ్జనార్, అవినాష్ మహంతి, గజరావు భూపాల్ వంటి సీనియర్ అధికారులు వివిధ బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. ఈ టోర్నీని పారదర్శకంగా నిర్వహించేందుకు ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నుండి 40 మంది ప్రతినిధులు రిఫరీలు హాజరవుతున్నారనీ, మ్యాచ్‌ల సమయంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి జ్యూరీ ఆఫ్ అప్పీల్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు.
1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ టీం లో అయిదుగురు హైదరాబాద్ సిటీ పోలీసులే
రాష్ట్రంలో గతంలో చక్కని ఫుట్ బాల్ క్రీడాకారులు ఉండేవారని, 1956వ సంవత్సరంలో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరిన భారత ఫుట్ బాల్ జట్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు క్రీడాకారులు నూర్ మొహమ్మద్, జుల్ఫీకరుద్దీన్, అహ్మద్ హుసేన్, అజీజుద్దీన్, బలరాం, తంగరాజ్, వంటివారు పాల్గొన్నారన్నారు. వీరిలో అయిదుగురు హైదరాబాద్ సిటీ పోలీస్ వారని తెలిపారు. ఆ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కూడా హైదరాబాదీయే. కాలక్రమేనా పోలీసు ఉద్యోగుల్లో ఫుట్ బాల్ క్రీడ పట్ల ఆసక్తి సన్నగిల్లిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ డిజిపి అనిల్ కుమార్, మల్కాజ్గిరి సీపీ అవినాష్ మహంతి, స్పోర్ట్స్ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్, అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సిపి ఎన్.శ్వేత, విజిలెన్స్ డిఐజి అభిషేక్ మహంతి, యూసఫ్ గూడా బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ పాల్గొన్నారు.






