మహానుభావులంతా పొట్టివాళ్లే కేటీఆర్.. సామ రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది.

మహానుభావులంతా పొట్టివాళ్లే కేటీఆర్.. సామ రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ మానసిక స్థితి సరిగా లేదని, ఆయనకు తక్షణమే చికిత్స అవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయన సైకలాజికల్‌గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ పిచ్చిగా వాగుతున్నారని, అందుకే ఆయనకు నేను ప్రత్యేకంగా మెడిసిన్ పంపించానని ఎద్దేవా చేశారు. కేటీఆర్ విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని, తప్పుడు మందులు తీసుకోవడం వల్లే ఇలాంటి ప్రవర్తన ఉంటుందని వైద్యులు కూడా చెబుతున్నారని ఆయన విమర్శించారు.

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ పార్టీ పేరును ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’గా మార్చేశారని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ అహంకారం వల్ల పార్టీ పతనం ప్రారంభమైందని, బీఆర్ఎస్‌ను పూర్తిగా బొంద పెట్టేదాకా ఆయన నిద్రపోయేలా లేరని మండిపడ్డారు. రాజకీయాల్లో పిచ్చోళ్లు ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి కేటీఆర్ ఒక ఉదాహరణ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ తన చుట్టూ ఉన్న నాయకుల ఎత్తు గురించి చేసిన వ్యాఖ్యలపై రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిందూ ధర్మ స్థాపన చేసి చరిత్ర సృష్టించిన ఛత్రపతి శివాజీ మహారాజ్, ప్రణబ్ ముఖర్జీ, పీవీ నరసింహారావు వంటి మహానుభావులు కూడా పొట్టివారేనని అన్నారు. కనీసం తన తల్లి శోభమ్మ, పార్టీ నేత జగదీశ్ రెడ్డి కూడా అలాగే ఉంటారనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోకూడదని హితవు పలికారు.

క్షేత్రస్థాయిలో ప్రజల తిరుగుబాటు

గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురవుతోందని సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తరిమి ఉంటే తట్టుకోలేక హరీష్ రావు మల్లన్నసాగర్‌లో మునిగి మంచిర్యాలలో తేలారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలను ప్రభుత్వం తగలబెట్టించిందని కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, కారుకు ఓటేయకపోతే కళ్లు పోతాయని ప్రజలను శపించడం కేటీఆర్ బుర్రలేనితనానికి నిదర్శనమని సామ రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Next Story