అఖండ భారత్ మ్యాప్‌‌లో తెలంగాణ మిస్సింగ్ వివాదం.. తెలంగాణ బీజేపీ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

అఖండ భారత్ మ్యాప్‌లో తెలంగాణ ఎక్కడా ఉంది? కావాలనే తెలంగాణను మిస్సింగ్ చేశారని అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అఖండ భారత్ మ్యాప్‌‌లో తెలంగాణ మిస్సింగ్ వివాదం.. తెలంగాణ బీజేపీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల టీడీపీ అగ్రనేత, ఏపీ మంత్రి నారా లోకేశ్‌‌ (Nara Lokesh)ను కొత్తగా నియామకం అయిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (BJP state president Madhav) మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు అఖండ భారత్ (Akhand Bharat) చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ చిత్ర పటం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్రం మ్యాప్‌లో ఉంటుంది. దీంతో నెట్టింట తీవ్ర వివాదం చెలరేగింది. అఖండ భారత్ మ్యాప్‌లో తెలంగాణ ఎక్కడా ఉంది? కావాలనే తెలంగాణను మిస్సింగ్ చేశారని అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అయితే ఆయన మరోసారి అఖండ భారత్ చిత్రపటం బహుకరించారు. కానీ ఈ సారి మాత్రం తెలంగాణతో ఉన్న అఖండ భారత్ మ్యాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చిత్రపటం వివాదంపై తెలంగాణ బీజేపీ (Telangana BJP tweet) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.

అఖండ భారతావని అమోఘ చరిత్రను అన్వయించే చిత్రపటంలో అభ్యంతరాలు వెతకడం అంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టే.. అని తెలంగాణ బీజేపీ పేర్కొంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడించింది. భారత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఓ చిత్రపటాన్ని అందజేసి తమ ఆప్యాయతను, సోదర భావాన్ని, తెలంగాణ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నట్లు పేర్కొంది. అలాగే ఏపీ స్టేట్ బీజేపీ చీఫ్ మాదవ్ ఎక్స్ వేదికగా వివరణ పోస్ట్ చేశారు. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు వేసే వారు, చరిత్ర ముందు లొంగాల్సిందే.. అని పేర్కొన్నారు.

ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంచుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య బంధాన్ని చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మాత్రమే.. నేను ఒక జాతీయవాదిని, ఒక గర్వపడే తెలుగు వాడిని, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో శాసనాల్లో చురుకుగా పని చేసినవాడిని.. అని పేర్కొన్నారు.

తెలంగాణ పట్ల, ఆ గొప్ప సంస్కృతి పట్ల నాకు ఉన్న ప్రేమ, గౌరవం రాజకీయ విమర్శలకు అతీతం అని తెలిపారు. రజాకార్లను పొగిడే, నిజాం వారసుల ముందు తల వంచినవారికి, తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావు అని వెల్లడించారు. నాకు సోదర తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు, మార్చలేరు.. అని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramchander Rao)ను మర్యాదపూర్వకంగా కలిసి.. భారతీయ సాంస్కృతిక వైభవానికి సంబంధించిన చిత్రాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

Next Story