వీర్యకణాల సేకరణ కేంద్రాల్లో అక్రమ దందాలు.. అనుమతి లేని సరోగసీ.. ఆరోగ్య శాఖకు ఏఐవైఎఫ్ వినతి

by Ramesh Naini |

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న సరోగసీ, సంతానోత్పత్తి (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది.

వీర్యకణాల సేకరణ కేంద్రాల్లో అక్రమ దందాలు.. అనుమతి లేని సరోగసీ.. ఆరోగ్య శాఖకు ఏఐవైఎఫ్ వినతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న సరోగసీ, సంతానోత్పత్తి (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ (AIYF) తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కోఠిలోని రాష్ట్ర ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆర్. పుష్పకు ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్‌లు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా (Surrogacy) సరోగసీ, సంతానోత్పత్తి (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలు ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో సరోగసీ పేరుతో అనధికారికంగా పిల్లలు లేని దంపతులకు సరోగసీ ద్వారా సంతానోత్పత్తి చేస్తామని చెప్పి రూ.30 నుంచి రూ.50 లక్షలు వసూళ్లు చేసి దంపతులను మోసం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

రాష్ట్రంలో వీర్యకణాల సేకరణ కేంద్రాల్లో ఈ అక్రమ దందాలు జరుగుతున్నా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అక్రమ సరోగసీ, స్పెర్మ్, చిన్నారుల ట్రాఫికింగ్ రాకెట్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సూచించారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తింపు ఉన్న సంతానోత్పత్తి కేంద్రాల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాలకృష్ణ, శివకుమార్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, కళ్యాణ్,రాజేందర్, మధుకర్, విష్ణు పాల్గొన్నారు.

Next Story