- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హన్మకొండ న్యూ శాయంపేటలో మంగళవారం కాళోజి కళా క్షేత్రంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహాత్ బాజ్ పాయిలతో కలసి ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే గృహాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పేదల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, రూ.22,500 కోట్ల వ్యయంతో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నాలుగు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో మధ్యలో నిలిచిపోయిన సందర్భాలను గుర్తించి, వాటి పూర్తి నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ గృహాల కార్యక్రమాన్ని అసిఫాబాద్ లో ప్రారంభించామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇండ్లలో సుమారు 1.80 లక్షల గృహాల నిర్మాణం పూర్తై, లబ్ధిదారులు గృహప్రవేశాలు జరిపరన్నారు. మరికొన్ని లక్షల ఇళ్లు వివిధ దశల్లో వేగంగా నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. పేదవాడికి ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని, అది కుటుంబ ఆత్మగౌరవానికి, భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, భవిష్యత్ ఆశయాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. అందుకే కులం, మతం, ప్రాంతం, రాజకీయ అభిప్రాయాలకతీతంగా పేదరికాన్నే అర్హతగా పరిగణించి ప్రతి అర్హ కుటుంబానికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో ఇంకా వేలాది మంది పేద కుటుంబాలు గృహాల కోసం ఎదురుచూస్తున్నాయని, ఈ అంశాన్ని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అమలు చేస్తున్న నమూనాను అనుసరించి, ప్రజలు నివసిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే అనుకూలమైన ప్రభుత్వ భూములను గుర్తించి గృహ నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు.
హైదరాబాద్‌లో లక్ష గృహాల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న తరహాలోనే వరంగల్‌లో కూడా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. రానున్న రెండున్నర సంవత్సరాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి విడతలవారీగా గృహాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ఇల్లు మంజూరు కాలేదనే ఆందోళనతో ఏ పేద కుటుంబం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహం అందించే బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.5,300 కోట్ల వ్యయంతో ఆధునిక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం టెండర్ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరదలు, మురుగునీటి నిల్వలు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు నగర జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. మామునూర్ విమానాశ్రయ అభివృద్ధి కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయం విస్తరణతో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని తెలిపారు.
తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, పారిశ్రామిక మౌలిక సదుపాయాల విస్తరణ, పట్టణాభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల వంటి అనేక కీలక కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ఎప్పటికీ మరచిపోదని, ప్రతి కుటుంబ జీవితంలో వెలుగులు నింపే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గృహ కేటాయింపు పత్రాలు అందుకున్న లబ్ధిదారులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఆత్మవిశ్వాసం, అభ్యున్నతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ పేద, నిరుపేద కుటుంబాల కష్టాలను గుర్తించి వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడు, ప్రమాదంలో ఆరోగ్యం, ఉపాధి కోల్పోయిన మరో కుటుంబం వంటి అర్హులైన నిరుపేదలకు గృహాలు అందడం సంతోషకరమన్నారు. వరంగల్ ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల కేటాయింపు పత్రాలు అందుకుంటున్న వారిలో అత్యధికులు నిజమైన అర్హులైన పేద కుటుంబాలేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, గృహ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హత, పారదర్శకత ప్రాతిపదికన 2బీహెచ్‌కే ఇళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగితే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం మరిన్ని గృహాలు నిర్మించి అర్హులందరికీ అందించే దిశగా కృషి చేస్తోందన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ గృహాలు కేటాయించడం ఆనందంగా ఉందని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూశాయంపేట రెండు పడక గదుల గృహాల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు అందించినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని గృహాలు నిర్మించి అర్హులందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీ సిఫారసుల అనంతరం వార్డు అధికారులు, గెజిటెడ్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేపట్టి అర్హులైన వారినే తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ల ధరలు చదరపు అడుగుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాణ్యమైన డబుల్ బెడ్‌రూమ్ గృహాన్ని ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ విలువైన ఆస్తిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ గృహాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేటాయించిన ఇళ్లలో వీలైనంత త్వరగా గృహప్రవేశం చేయాలని కోరారు. గృహాలను ఖాళీగా ఉంచకుండా లబ్ధిదారులే స్వయంగా నివసించాలని సూచించారు.ఈ గృహ సముదాయం విద్యాసంస్థలు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులకు సమీపంలో ఉన్న మంచి ప్రాంతంలో నిర్మించబడిందని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి.అజీజ్ ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఆర్డిఓ వెంకటేష్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఈ రవీందర్, అదనపు కమిషనర్ జోనా, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఇతర అధికారులతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.






