ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి: ఏఐడీఎస్‌వో

by Vemula.Srinu Prasad |

తెలంగాణలో సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే ప్రతిపాదనను ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్‌వో) వ్యతిరేకించింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.సత్యనారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు....

ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి: ఏఐడీఎస్‌వో
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే ప్రతిపాదనను ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్‌వో) వ్యతిరేకించింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.సత్యనారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులు విద్యా హక్కును కోల్పోతారని, ఇది భారీ స్థాయిలో డ్రాప్ అవుట్లకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలను మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదని, వాటిని బలోపేతం చేయడమే అసలైన పరిష్కారమని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ వసతులు, ప్రయోగశాలల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.నితీష్, కార్యదర్శి ఎన్.నాగరాజ్ మాట్లాడుతూ.. పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టకుండా, సామాజిక సమానత్వానికి పునాది అయిన ప్రభుత్వ విద్యను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐడీఎస్‌‌వో సభ్యులు ప్రణీత్, విశాలి, నిహిత తదితరులు పాల్గొన్నారు.

Next Story