పార్టీలో అంతర్గత విభేదాలపై AICC సీరియస్.. రెబల్ నేతలకు చెక్ పెట్టేలా వ్యూహం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 01:36:16  IST  )

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న అంతర్గత విభేదాలు, క్రమశిక్షణా రాహిత్యంపై ఏఐసీసీ అధిష్టానం సీరియస్ అయింది.

పార్టీలో అంతర్గత విభేదాలపై AICC సీరియస్.. రెబల్ నేతలకు చెక్ పెట్టేలా వ్యూహం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోని నేతల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేస్తున్న కామెంట్లు, వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వారు తరచూ చేస్తున్న కామెంట్లు ప్రభుత్వం, పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, సీనియర్ నేతల సమావేశంలో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు, ఎన్నికల్లో పార్టీ పనితీరు, నేతల వ్యవహారశైలి, పార్టీలో సంస్థాగతంగా బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీలో నేతల మధ్య విబేధాలు, గొడవలు, ముఠా తగాదాలు, గ్రూపు వివాదాలు ఏర్పడితే పరిష్కరించేందుకు, క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఇప్పటికే పలు వివాదాలు, నేతల వ్యవహారంపైనా కమిటీ విచారణ చేపట్టింది. ఉమ్మడి వరంగల్‌లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి అదే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల మధ్య విబేధాలు, వివాదాలు, సిద్దిపేట జిల్లాలో మాజీ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, స్థానిక నేతల మధ్య ఏర్పడిన వివాదంపై క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చొరవ చూపింది.

రంగంలోకి అధిష్టానం..

ప్రస్తుతం కొందరు నేతల వ్యవహర శైలిపై నేరుగా అధిష్టానమే వారితో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సిద్ధపడుతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు సదరు నేతలకు తాము ఎంత చెప్పినా కూడా వినడం లేదని, ఇక మీరే వారితో మాట్లాడి వ్యవహారాన్ని చక్కదిద్దాలని రాష్ట్ర నేతలే కోరినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం నడుస్తున్నది. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ భావిస్తున్నందున ఆ లోపే పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించేలా హైకమాండ్ రంగంలోకి దిగనుందని పార్టీనేతలు పేర్కొంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందే పార్టీలోని నేతల మధ్య సమన్వయానికి పార్టీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో కొందరు నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ప్రత్యర్థి పార్టీలకు సహకరించడం, పార్టీ ఓటమికి కారణమయ్యారనే ఫిర్యాదులు హైకమాండ్‌కు అందినట్లు తెలిసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతల తీరును త్వరలోనే రాష్ట్ర నేతలు సమీక్షిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story