AI in Agriculture : వ్యవసాయంలో ఏఐ సాంకేతికత..ప్రయోజనాలు అధికం!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-06-28 15:09:23  IST  )

జనాభా పెరుగుతోంది(Population Growing)..కాని భూమి విస్తీర్ణం అంతే..అయితే ఉన్న భూమిలో సాగు విస్తీర్ణం పెంచవచ్చు...అదే సమయంలో పెరుగుతున్న జనావాసాల కారణంగా సాగు భూమి విస్తీర్ణం పడిపోతు వస్తుంది.

AI in Agriculture : వ్యవసాయంలో ఏఐ సాంకేతికత..ప్రయోజనాలు అధికం!
X

దిశ, వెబ్ డెస్క్ : . జనాభా పెరుగుతోంది(Population Growing)..కాని భూమి విస్తీర్ణం అంతే..అయితే ఉన్న భూమిలో సాగు విస్తీర్ణం పెంచవచ్చు...అదే సమయంలో పెరుగుతున్న జనావాసాల కారణంగా సాగు భూమి విస్తీర్ణం పడిపోతు వస్తుంది. దీంతో జనాభా పెరుగుదలకు సరిపడ ఆహార ఉత్పత్తుల కొరత(Food shortage) సమస్య సవాల్ గా మారింది. 2050 నాటికి ఆహారం కోసం వచ్చే డిమాండ్‌ను తీర్చడానికి పంట దిగుబడి 60% పెరగాలంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాగు భూముల్లో అధిక దిగుబడుల సాధక ఓ పరిష్కార మార్గంగా కనిపిస్తుండగా..ఇందుకు రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇతర రంగాల మాదిరిగానే కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) వ్యవసాయరంగంలో కూడా మెరుగైన ఫలితాలను అందిస్తుందన్న అంచనాలున్నాయి. సెన్సార్ ఫ్యూజన్" ద్వారా డ్రోన్లు, ఉపగ్రహాలు, నేల నుంచి సేకరించబడే జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి వ్యవసాయ రంగంలో సమస్యలకు పలు రకాల మార్గాలను సూచిస్తుంది.

బహుళ ప్రయోజనాలు

విత్తనం ఎంపిక దగ్గర నుండి విత్తనం వేసే దశ నుంచి కోతకు వచ్చే దశతో పాటు మార్కెటింగ్ వరకు ఏఐ సాంకేతికత ప్రయోజకారిగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పంటసాగు సమయం, వాతావరణ పరిస్థితులు, ఎరువులు, పురుగు మందుల మోతాదులను సిఫార్సు చేయడంలో సహాయపడుతుందంటున్నారు. నీటిపారుదల, పంటకోత సమయంపై మార్గదర్శకంతో పాటు ఫర్టిలైజర్ల వాడకం తగ్గడం, మెరుగైన పంట నాణ్యతతో గణనీయమైన ఖర్చు ఆదా చేస్తూ అధిక లాభాలు వ్యవసాయ దిగుబడుల అభివృద్ధి, ఖచ్చితమైన వ్యవసాయం రైతులకు తక్కువ వనరులతో ఎక్కువ పంటలు పండించడంలో సహాయపడుతుంది. ఏయే భూముల్లో ఏలాంటి పంటలు వేయాలన్న సాంకేతిక సలహాలతో అధిక దిగుబడులకు ఏఐ సాధనంగా నిలుస్తుంది. నేల స్వభావాలను, తేమ, వాతావరణ పరిస్థితులను అనుసరించి పంట నీటి అవసరాలతో పాటు వాతావరణ డేటాను కూడా ఏఐ సాంకేతికత అందిస్తుంది. పరిమాణం, రంగు ఆధారంగా పంట ఉత్పత్తులను గ్రేడ్‌ ప్రాసెస్ కూడా చేయగలుగుతోంది. మెషన్ లెర్నింగ్ తో పంటల్లో కలుపు మొక్కలను గుర్తించి వేరు చేయడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడనుంది. ఆయా పనుల్లో డ్రోన్ టెక్నాలాజీ ఏఐ సాంకేతికతకు అనుసంధానంగా ఉండనుంది.

దిగుబడులు పెంచుకోవచ్చు : సత్య నాదేళ్ల

ఏఐ పరిజ్ఞానం రైతులు తమ దిగుబడులు పెంచుకోవచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) తెలిపారు. తన వీడియోలో వ్యవసాయంపై ఏఐ ప్రభావం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో రైతులు తమ పంట దిగుబడిని పెంచుకోవడంలో సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి పొందిన జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి, రైతులకు తమ భూమి పరిస్థితి గురించి తెలుసుకోవడం ద్వారా వారికి మరింత మేలు జరిగిందన్నారు. ఈ సాంకేతికత రైతుల భాషలో ఉండటం ద్వారా వారి పనులను మరింత సులభతరం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు."సెన్సార్ ఫ్యూజన్" ద్వారా ఇది డ్రోన్లు, ఉపగ్రహాలు, నేల నుంచి సేకరించబడే జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి వ్యవసాయ రంగంలో సమస్యలకు పలు రకాల మార్గాలను సూచిస్తుంది. ఈ సమాచారాన్ని ఏఐ విశ్లేషించి, రైతులకు ప్రత్యక్షంగా వారి సొంత భాషలో వివరించగలుగుతుందని తెలిపారు.ఏఐ వినియోగం వల్ల పంటలకు రసాయనాల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు సత్య నాదెళ్ల. దీంతోపాటు రైతులు వారి పొలాల గురించి తెలుసుకుని, తక్కువ నీటితో పంటలను పండించుకోవచ్చన్నారు. ఇలా చేయడం ద్వారా వారి పొలాల్లో నీటి ఉత్పత్తిని మెరుగుపరుచుకుని, అధిక దిగుబడిని సాధించవచ్చని సత్య నాదెళ్ల చెప్పారు. ఏఐ ఆధారిత వ్యవసాయ కార్యక్రమాలు రైతుల ప్రయోజనాన్ని నిరూపించాయన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ఏఐ ఎంతో భవిష్యత్తునిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వీడియోపై ప్రముఖ టెక్ బిలియనీర్, ఎలాన్ మస్క్ స్పందించారు. తన X హ్యాండిల్ ద్వారా ఈ వీడియోని పంచుకుని, "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ పరిష్కరిస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఏఐ వ్యవసాయ రంగంలో ఎంతో గొప్ప పరిణామాలను తీసుకువస్తున్నందుకు మస్క్ అభినందనలు తెలియజేశారు.

పరిమితులున్నాయి..!

వ్యవసాయం రంగంలో ఏఐ సాంకేతికత ఖరీదైనది కావడంతో అధిక సంఖ్యలో ఉండే సన్న, చిన్న కారు రైతులు ఇది భారం కానుంది. విభిన్న వాతావరణం..నేలలపై శాస్రీయ డేటా సక్రమంగా లేకపోతే ఏఐ తడబాటు తప్పదు. విరివిగా డ్రోన్ల వినియోగం ఇతర సమస్యలను సృష్టించవచ్చన్న ఆందోళన కూడా ఉంది. అలాగే ఏఐ సాంకేతికత ఖచ్చితత్వ నిర్ధారణ సరిగా లేకపోతే పాడి పంటలు నష్టపోయే ప్రమాదం కూడా ఉండనుందంటున్నారు.

విదేశాల్లో జోరుగా ఏఐ టెక్నాలాజీ

అమెరికా, చైనా, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 'సాగు'తున్న ఆధునిక వ్యవసాయంలో ఆటోమేటెడ్ యంత్రాలు నాట్లు వేస్తున్నాయి... నీళ్లు పెడుతున్నాయి. కలుపు తీస్తున్నాయి.. ఎరువులు వేస్తున్నాయి... పంట ఎదుగుదలను పరిశీలిస్తున్నాయి.. చీడపీడలను గుర్తిస్తున్నాయి.. క్రిమిసంహారకాలు చల్లుతున్నాయి. మన దేశంలోనూ ఇలాంటివి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్ లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ)లోని సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్'కు కృత్రిమ మేద(ఏఐ) ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, విస్తరణ బాధ్యతలను అప్పగించింది.

కేంద్ర ప్రభుత్వం రూ.2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ను ఏర్పాటు చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, బిగ్ డేటా, రిమోట్ సెన్సింగ్ లతో సహా సరికొత్త సాంకేతికతలను ఇందులో పొందుపరిచింది. అన్ని రాష్ట్రాల్లో ఏఐ ప్రాజెక్టుల నిర్వహణకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు 'నమో డ్రోన్ దీదీ' పథకం కింద మహిళా సంఘాల ద్వారా 15 వేల డ్రోన్లను మంజూరు చేసింది. దేశంలో ఇప్పటికే ఏఐ సాయంతో తయారు చేసిన 'కిసాన్ సువిధ లాంటి యాప్లు రైతులకు సేవలందిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో సంస్థలతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తగిన సాంకేతికత, మౌలిక వసతులు లేనందున దేశంలో ఏటా పెద్దఎత్తున పంట వృథా అవుతోంది. కృత్రిమమేధ సాయంతో ఆ సమస్యను పరిష్కరించి, దిగుబడులనుని పెంచాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. దీనికోసం ఐదు కోట్ల మంది రైతుల సమాచారాన్ని కేంద్రం ఈ సంస్థలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్ వంద గ్రామాల్లో పని ప్రారంభించగా, అమెజాన్ మొబైల్ యాప్ రైతులకు మార్గనిర్దేశం చేస్తోంది. ఈ చర్యలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గత ఏడాది 30 శాతం అధిక దిగుబడి సాధించినట్లు 'నీతి ఆయోగ్' పేర్కొనడం గమనార్హం.

Next Story