- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI in Agriculture: రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ.. మంత్రి తుమ్మల
రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ తీసుకొని రావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (farmers) రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ తీసుకొని రావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే (Krishivaas) కృషివాస్ సంస్థ ప్రతినిధులతో పలు దఫాలుగా నిర్వహించిన సమావేశాల్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సంస్థ వారికి యాప్‌లో చేయాల్సిన మార్పుల గురించి, సలహాలు సూచనలు ఇచ్చి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తమ యాప్‌లో మార్పులు చేసుకొని, ఫీల్డ్‌లో పర్యవేక్షించిన అనంతరం, ఇవాళ సచివాలయంలో (Thummala Nageswara Rao) మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కృషివాస్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారుచేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమెజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వచ్చే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా టెక్నాలజీ గురించి మంత్రికి వివరించారు.
అంతే కాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న రోగాన్ని కూడా గుర్తించి దానికి నివారణ చర్యలు కూడా సిఫార్సు చేస్తుందని తెలిపారు. పొలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మొక్కకు తెగులు సోకిందో ముందుగానే గుర్తించి, దానికి పిచికారి చేయాల్సిన మందును కూడా మనకు ఏఐ చెబుతోందన్నారు. దీంతో సంబంధిత రైతు ఆ పంటకు పిచికారి చేసి పంటలను సరైన సమయానికి సంరక్షించుకోవచ్చని వెల్లడించారు. అసలు పొలం దగ్గరకే పోకుండా ఈ యాప్ ద్వారా పంట స్థితిగతులను తెలుసుకోవచ్చని మంత్రికి చెప్పారు. రైతు పంట ఎంత వేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు.. అన్న డేటా కూడా రియల్ టైమ్‌లో వ్యవసాయ అధికారులకు లభిస్తుందన్నారు. తక్కువ కూలీ ఖర్చుతో, అధిక దిగుబడి పొందే అవకాశం కలుగుతుందన్నారు.
అలాగే ఈ ఏఐ యాప్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముందస్తు సమాచారం, సమస్యను గుర్తించడం, సమస్య చోటులోనే స్ప్రే చేయడం, వాతావరణ హెచ్చరికలు, నేల, ఆకు తేమ సమాచారం, ఆయిల్ పామ్‌లో ప్రతి చెట్టుకు రియల్ టైమ్ సమాచారం ఇస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా 60 కు పైగా పంటలను (పత్తి, మొక్క జొన్న, వరి, మిరప, కూరగాయలు, ఆయిల్ పామ్, ఇంకా ఎన్నో రకమైన పంటలు) పరీక్షించించే విధంగా అవకాశం ఉంది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, కృషి వికాస్ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి యాప్‌ల వినియోగించడం వలన రైతుల విలువైన సమయం ఆదా అవడంతో పాటు, రైతులు తమ పంటలకు ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకునే వీలుకలుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతులందరు ఈ టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు.






