రైతు తలసరి ఆదాయం పెంపు దిశగా కార్యక్రమాలు.. అగ్రికల్చర్ ​సెక్రటరీ సురేంద్ర కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్ర రైతు తలసరి ఆదాయం 2047 సంవత్సరానికి రూ. 12,53,733కు పెరిగేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు.

రైతు తలసరి ఆదాయం పెంపు దిశగా కార్యక్రమాలు.. అగ్రికల్చర్ ​సెక్రటరీ సురేంద్ర కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతు తలసరి ఆదాయం 2047 సంవత్సరానికి రూ. 12,53,733కు పెరిగేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాలు, అపరాల సాగు విస్తీర్ణం భారీగా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. వర్సిటీ వైస్ ఛాన్స్​లర్ ​దండా రాజిరెడ్డి తో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కూరగాయల సాగును భారీగా ప్రోత్సహించేందుకు రైతుల నుంచి నేరుగా కూరగాయలు తీసుకునేందుకు కలెక్షన్ సెంటర్లు, అలాగే మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెంచుతామన్నారు. పండ్లు ఇప్పుడున్న నాలుగున్నర లక్షల ఎకరాల నుంచి 12 లక్షల ఎకరాలకు, కూరగాయలు 10 లక్షల ఎకరాలు, అలాగే సుగంధ ద్రవ్య పంటల సాగు 6 లక్షల ఎకరాలకు విస్తరించేలా ప్రణాళికలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రధానంగా సాగుతున్న మామిడి ఇతర పండ్ల ఎగుమతులు పెంచేందుకు వేపర్ హీట్ ట్రీట్మెంట్, ఇర్రేడియేషన్ ట్రీట్మెంట్ సెంటర్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

పెరుగుతున్న వినియోగం నేపథ్యంలో 10 లక్షల ఎకరాల మేర తృణ ధాన్యాలు, మరో ఏడు లక్షల ఎకరాల అపరాల పంటలు సాగు విస్తీర్ణం కూడా అవసరమన్నారు. 2025 నాటికి 2.7 లక్షల ఎకరాల్లో ఉన్న పామాయిల్ విస్తీర్ణాన్ని 12 లక్షల విస్తీర్ణానికి చేరుకోవాలని, పట్టు పరిశ్రమలో ఇప్పటి దానికంటే ఐదు రెట్లు మల్బరీ ఉత్పత్తి, ఎనిమిది రెట్లు టస్సర్ సిల్క్ ఉత్పత్తి టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలిపారు. వీటికి మద్దతుగా మైక్రో ఇరిగేషన్ను 40 లక్షల ఎకరాలకు, హెక్టార్కు 9 కిలో వాట్స్ చొప్పున ఫామ్ పవర్ సామర్థ్యం పెంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే 50 లక్షల టన్నుల కోల్డ్ చైన్ సామర్థ్యం, అదనంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల వేర్హౌసింగ్ కెపాసిటీ తో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక లోకల్ మార్కెట్ ఏర్పాటు చేస్తే కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. అంటు కట్టిన కూరగాయల మొక్కలను, అలాగే పందిరి కూరగాయల సాగును భారీగా ప్రోత్సహించేందుకు ప్రణాళికలు వివరించారు. ఉద్యాన రంగంలో పెట్టే ప్రతి ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయలు లాభం వస్తుందని, అందుకు కావాల్సిన ప్రణాళికలను డాక్టర్ రాజిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Next Story