- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 104 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం
రాష్ట్రంలో ఈ పంటకాలానికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకం వెంటనే ప్రారంభించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈ పంటకాలానికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకం వెంటనే ప్రారంభించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రైతులకు ఉపయోగకరమైన, డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిని సబ్సిడిపై అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కేటాయింపులు జరిపి, సరఫరా చేయాలని సూచించారు. ఈ పథకంలో సన్న, చిన్న కారు, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నమో డ్రోన్ దీదీ కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళసంఘాలకు అందించాలని పేర్కొన్నారు. కేంద్రం కేటాయించిన ఎరువులు, రాష్ట్రానికి సరఫరా అయిన ఎరువుల వివరాలపై ఆరా తీసి సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో రోజు సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో వచ్చేటట్లు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జెపి నడ్డాకు లేఖ రాయడం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో జులై వరకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఆగస్టు మాసానికి సరిపడా ఎరువులను తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నడు లేని విధంగా జోన్నల సేకరణ :
మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు, జొన్న వివరాలు, రైతుల చెల్లింపులపై వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఈ సారి 1,55,257 మెట్రిక్ టన్నుల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా సేకరించి, దీనికి సంబంధించి 91 వేల మెట్రిక్ టన్నులకు రూ. 302 కోట్లను రైతులకు చెల్లించినట్లు తెలిపారు. పొద్దతిరుగుడు సంబంధించి 4,333 టన్నులు సేకరించగా, అందుకు సంబంధించిన రూ. 31 కోట్లను రైతులకు చెల్లించామన్నారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా 35 వేల మెట్రిక్ టన్నుల జొన్నలను మాత్రమే మార్క్ ఫెడ్ ద్వారా సేకరించగా, దానికి మూడింతలు మా ప్రభుత్వం సేకరించినట్లు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలు నిర్దేశించే వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ దక్షిణ ప్రాంతీయ సమావేశం శుక్రవారం మారిగోల్డ్ హోటల్లో నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి వ్యవసాయ శాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొని, వారి సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పెరిగిన సాగు ఖర్చులను ప్రతిబింబింప చేసి రైతులకు ఇచ్చే మద్ధతు ధరలను డా. స్వామినాథన్ కమిటీ సిఫారస్ ల మేరకు సీఏసీపి కేంద్ర ప్రభుత్వానికి సూచించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.






