Delimitation: 175 అసెంబ్లీ సీట్లు.. 25 లోక్‌సభ స్థానాలు.. తెలంగాణ రాజకీయ మ్యాప్ మారిపోతుందా?

by Ramesh Naini |

జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Delimitation: 175 అసెంబ్లీ సీట్లు.. 25 లోక్‌సభ స్థానాలు.. తెలంగాణ రాజకీయ మ్యాప్ మారిపోతుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది. అయితే రెండేళ్ల క్రితం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్ సభ, రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో.. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార, విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్లు తెలిసింది. అలా పెంచితే.. లోక్ సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశముంది. ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు 153 కాకుండా.. ఆ సంఖ్య 161 నుంచి 175గా ఉండే చాన్స్ ఉంది.

వ్యతిరేకత రాకుండా ఉండేందుకు..

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ను వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశముంది. దీంతో లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో 543 స్థానాలు ఉండగా.. సుమారు 180 సీట్లను వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరనే చర్చ జరుగుతున్నది. అన్ని పార్టీలకూ వారి సేవలు అవసరమే. ఈ నేపథ్యంలో పురుష నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు లోక్ సభ సీట్లను కూడా సాధ్యమైనంత మేర పెంచాలనే ఒక ప్రతిపాదన అధికార ఎన్డీయే చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. లోక్‌సభ సీట్లు ఎన్ని పెంచాలి? దానికి ప్రాతిపదిక ఏమిటి? అనేది ఇంకా ఖరారు కాలేదు. మహిళలకు కేటాయిస్తున్న 33.33 శాతం అంటే 180 సీట్లను అదనంగా పెంచాలా? లేక జనాభా ఆధారంగా 50 శాతం సీట్లు పెంచాలా? అనే అనే చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. 33 శాతమైనా, 50 శాతమైనా దాని ఆధారంగా తెలంగాణలోనూ లోక్ సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది. 33 శాతం పెంచితే ఆరు లోక్ సభ స్థానాలు పెరిగి.. పార్లమెంట్ స్థానాల సంఖ్య 23కు చేరుతుంది. ఒక వేళ 50 శాతం సీట్లు పెంచాలనుకుంటే ఆ సంఖ్య 25కు చేరుతుంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో లోక్ సభ సీట్లు 23 లేదా 25 అయ్యే అవకాశమున్నది.

పునర్విభజన చట్టంలో మార్పులు?

రాష్ట్రంలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఒక్కో సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువగా ఉంటే రాజకీయ అస్థిరతకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సెగ్మెంట్లను పెంచాలని డిసిషన్ తీసుకున్నారు. ఒక్కో లోక్ సభ పరిధిలో సగటున రెండు అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 34 స్థానాలు పెంచి సీట్ల సంఖ్యను 153కు పెంచాలని 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చారు. చట్టంలో పేర్కొన్న పద ప్రయోగంలో జరిగిన పొరపాటును సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. 2027 జనాభా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే ఇక్కడ ఇంకో నిబంధన ఉంది. ఎన్ని లోక్ సభ స్థానాలు ఉన్నా.. అన్నింటిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సమానంగా ఉండాలి. అంటే ఒక్కో లోక్ సభకు 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు. దేశవ్యాప్తంగా డీ లిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య 23కు పెరిగితే.. ఏడు చొప్పున వేసుకుంటే ఆ సంఖ్య 161కి చేరుకుంటుంది. అదే 25కు పెరిగితే.. అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 175కు పెంచాల్సి ఉంటుంది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో 8 నుంచి 9 అసెంబ్లీ స్థానాలను ఉంచాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుంది. దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 153 అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా పునర్విజన చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది.

‘దక్షిణాది’పై తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ

జనాభా ఆధారంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే సీట్ల సంఖ్య పరంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదికి చెందిన పార్టీలన్నీ ఏకమై సమావేశాలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. 33 లేదా 50 శాతం.. ఏ లెక్కన సీట్ల పెంపు జరిగినా.. దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని చెప్పాయి. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే.. ఉత్తర భారతంలోని స్థానాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేసి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణ భారతేదేశానికి అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాంతం రాజకీయంగా, అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల వారీగా అంచనాలు ఇవి..

Next Story