వేసవి విద్యుత్ అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు.. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి దిశానిర్దేశం

by Ramesh Naini |

రాబోయే వేసవి కాలానికి, రబీకి సన్నద్ధంగా ఉండటానికి ఇప్పటి నుండే తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.

వేసవి విద్యుత్ అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు.. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే వేసవి కాలానికి, రబీకి సన్నద్ధంగా ఉండటానికి ఇప్పటి నుండే తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి (NPDCL CMD Varun Reddy) పేర్కొన్నారు. ట్రాన్స్కో సీఈలు, ఎస్ఈలు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు, ఎస్ఏఓలతో హన్మకొండ, నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తగా నెలకొల్పే 220 కెవి, 132 కెవి కొత్త సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, డబుల్ సర్క్యూట్ లైన్లు, బే ఎక్స్టెన్షన్ ప్రతిపాదనలు పంపాలని, పురోగతిలో ఉన్న పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని తదనుగుణంగా పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. 16 సర్కిళ్ల పరిధిలో కొత్తగా నెలకొల్పే 220 కెవి, 132 కెవి కొత్త సబ్ స్టేషన్లు ఎక్కడైతే పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు ఉందొ అక్కడ పెంచాలని, సబ్ స్టేషన్‌లో బే ఎక్స్‌టెన్షన్‌ల ఏర్పాటు, కొత్త డబుల్ సర్క్యూట్ లైన్ల పై ఎస్ఈలు ప్రతిపాదించారు. వాటికి కావాల్సిన అనుమతుల కొరకు ట్రాన్స్‌కో‌కు లేఖలు రాయాలని సీఎండీ తెలిపారు. ముందస్తుగా అన్ని చర్యలు తీసుకొని వేసవికి, రబీకి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

అనంతరం ఎన్పీడీసీఎల్ అధికారులతో సమీక్షిస్తూ ప్రమాదభరితంగా ఉండి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి రోడ్ క్రాసింగ్ లైన్లు, డబల్ ఫీడింగ్ పాయింట్లు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెలు సరిచేసిన వాటి పురోగతిపై చర్చిస్తూ పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయాలని అన్నారు. విధిగా ఎల్‌సీ యాప్ ఉపయోగించుకొని ఎల్‌సీ యాప్‌లోనే లైన్ క్లియరెన్స్ ఇవ్వాలన్నారు. పురోగతిలో ఉన్న 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్ పనులు వేగవంతం చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్ లు తగ్గించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు పెంచాలని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు డిపార్ట్మెంట్ వెహికల్ ద్వారానే జరగాలన్నారు. సర్కిళ్ల పరిధిలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం కల్పించి వినియోగదారుల్లో చైతన్యం కలిగించాలని వివరించారు.

రెవెన్యూ కలెక్షన్లు పెంచాలన్నారు. రెండేళ్లు పై బడిన వర్క్ ఆర్డర్స్ పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా నిర్మించే 33/ 11 కెవి సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని కోరారు. వ్యవసాయ సర్వీసులు, కొత్త సర్వీసులు, టీజీ ఐపాస్ లో నమోదు చేసుకున్న సర్వీసులు త్వరిత గతిన మంజూరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, సి. ప్రభాకర్, సీఈలు టి. సదర్ లాల్, కె తిరుమల్ రావు, అశోక్, రాజు చౌహన్, ట్రాన్స్కో సీఈ శ్రీరామ్ కుమార్, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ 16 సర్కిళ్ల ఎస్ఈలు తదితరులు పాల్గొన్నారు.

Next Story