రైతుల కోసం మాట్లాడండి.. వ్యక్తిగత విమర్శలు మానండి

by velandi.Saikiran |

రేవంత్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

రైతుల కోసం మాట్లాడండి.. వ్యక్తిగత విమర్శలు మానండి
X

రైతుల కోసం మాట్లాడండి.. వ్యక్తిగత విమర్శలు మానండి

మొక్కజొన్నకు మద్దతు ధర తెప్పించండి.. రైతుల పక్షాన నిలవండి

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మీ బీజేపీలో పంచాయితీ ఉంటే మీరు, మీరు చూసుకోండి : రాజ్యసభ సభ్యుడు, అనిల్ కుమార్ యాదవ్

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలు, రైతాంగం, కేంద్ర నిధులు, రాష్ట్ర హక్కులపై మాట్లాడాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమని, రైతుల గురించి మాట్లాడరు.. వడ్ల గురించి మాట్లాడరు.. మొక్కజొన్న రైతుల గురించి మాట్లాడరని, కానీ, వ్యక్తిగత విమర్శలు మాత్రం చేస్తారని ఆయన మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

అరవింద్ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీతో అని, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. మీ బీజేపీ లాగా నాగపూర్‌లో కూర్చొని ఆదేశాలు అమలు చేసే పార్టీ తమ కాంగ్రెస్ కాదని, తమ పార్టీ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ నడిచే ప్రజాస్వామ్య పార్టీ ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ల గురించి ఎంపీ అరవింద్ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి నిజామాబాద్‌లో మీ తమ్ముళ్లు చేస్తున్న అరాచకాల గురించి మేము మాట్లాడలేమా అని లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడాలని, మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి మొక్కజొన్నకు మద్దతు ధర ఇప్పించండి..రైతులకు సాయం తీసుకురండి మంత్రి సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి గ్రామస్థాయి రాజకీయాల నుంచి ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగి చివరకు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వరి ధాన్యం గోదాములు నిండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఎంపీగా అరవింద్ ప్రధాని నరేంద్ర మోదీతో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో గానీ ఎందుకు మాట్లాడటం లేదని లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేస్తున్న జగదీష్ రెడ్డి ముందుగా పేర్లు బయట పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. ముందు వాళ్ల కుటుంబ తగాదాలు సరిచేసుకోవాలని, ఇతర పార్టీలపై విమర్శలు చేయడం తర్వాత విషయమని మంత్రి మండిపడ్డారు.

మీ బీజేపీలో పంచాయితీ ఉంటే మీరు, మీరు చూసుకోండి : రాజ్యసభ సభ్యుడు, అనిల్ కుమార్ యాదవ్

ఎంపీ అరవింద్ హీట్ వేవ్ తో సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారని, ఆయన ఎండలో తిరగేటప్పుడు గొడుగు పెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. మీ బీజేపీలో పంచాయితీ ఉంటే మీరు, మీరు చూసుకోవాలని, మీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు పీసీసి అధ్యక్షుడిని చేసిందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏవిధంగా ప్రజల గురించి ఆలోచిస్తుండో ఆయన ను చూసి నేర్చుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పే వారు బీజేపీలో లేరని, మోడీకి దేశం గురించి ఆలోచించే తపన ఉంటే విదేశీ ప్రయాణం చేసేవారా? మీరు చేసే పొరపాట్లు దేశం మీద ఎందుకు రుద్దుతున్నారని ఆయన ప్రశ్నించారు.

Next Story