- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన ప్రాంత సమస్యలపై అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలి
గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు.

గిరిజన ప్రాంత సమస్యలపై అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలి
ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేయండి
గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటా : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గిరిజన ప్రాంత సమస్యలపై అధికారులతో సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. గిరిజన జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ సచివాలయంలో గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, అటవీ శాఖ అధికారులు, గిరిజన ప్రాంతాల ప్రజాప్రతినిధులతో మంత్రి లక్ష్మణ్‌కుమార్ అనేక అంశాలపైన విస్తృతంగా చర్చించారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తున్నా అమలు దశలో ఎదురవుతున్న అడ్డంకులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలంటే శాఖల మధ్య సమన్వయం అత్యవసరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించారని, వారికి కేటాయించిన నిధులు లక్ష్యానికి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టాలని, నిధులు ఉన్నా పనులు జరగకపోతే సహించబోమని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. అటవీ భూములు, పోడు సాగు, ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద హక్కుల పత్రాల జారీ విషయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు అత్యంత ప్రాధాన్యంతతో కూడుకున్నవని, అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేసి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వేగంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అడవిని నమ్ముకున్న గిరిజనలకు అటవీ చట్టం అనుసరించి వారికి ఎక్కడ వీలు అయితే అక్కడ వ్యవసాయం చేసుకునేలా సాగు భూమిని అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. గిరిజన యువతను ప్రభావితం చేస్తున్న కుల ధృవీకరణ సమస్యలపై హైకోర్టు అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి ఎస్టీ సర్టిఫికెట్ వ్యవహారంలో శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కుల ధృవీకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరళమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, అటవీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక రవాణా సమస్యలు గిరిజనులకు అడ్డంకి కాకూడదని, అవసరమైన చోట ప్రత్యేక అనుమతులు ఇచ్చి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. తాగునీటి సమస్య నివారణకు కొత్త బోర్లు త్రవ్వడం, పాత వనరులను పునరుద్ధరించే పనులను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. స్థానిక సమస్యలను ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లో ముఖ్య సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని మంత్రి గడువు విధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ, ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్ర నాయక్, చిక్కుడు వంశీకృష్ణ, మురళి నాయక్, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, డిఎఫ్ఓలు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






