- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీళ్ల కోసం ఎంపీడీవో కార్యాలయం ఎదుట మహిళల ధర్నా
ప్రతి రోజు వాగు చేమల నీళ్లే దిక్కని.. మహిళలు ఆందోళనకు దిగారు. మమ్మల్ని పట్టించుకునే అధికారే లేరని మహిళలు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

దిశ, మంచిర్యాల: ప్రతి రోజు వాగు చేమల నీళ్లే దిక్కని.. మహిళలు ఆందోళనకు దిగారు. మమ్మల్ని పట్టించుకునే అధికారే లేరని మహిళలు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ మహిళలు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మధ్యాహ్నం సమయంలో ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా టాటా ఏసీ వాహనంలో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తమ గోడును వెల్లబోసుకున్నారు.కొన్ని నెలలుగా తమ గ్రామానికి త్రాగునీరు రావడంలేదని అన్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఈజీఎస్ కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని వాగు నీటి చెలిమెలు ద్వారా వంట చేసుకునేందుకు త్రాగునీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శికి త్రాగు నీటి సమస్య ఉందని చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి ఇప్పటివరకు ఒక్క ఇంటికి కూడా భగీరథ నల్లా నీటి కనెక్షన్ ఇవ్వలేదన్నారు. కాలనీలో 20 కుటుంబాలు ఉన్నాయన్నారు. ఎర్రని ఎండలో వాగు నీటిని తెచ్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు అంత ఇండ్ల ముందు పారుతుందన్నారు.త్రాగు నీటి సమస్య తీర్చకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు.
కాలనీవాసులు అడ్డుకుంటున్నారు..
మహిళలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి త్రాగు నీటి కోసం బైఠాయించిన విషయాన్ని ఫోన్లో ఎంపీడీవో దృష్టికి తీసుకు వెళ్లడంతో ఇదివరకే కలెక్టర్ గ్రాంట్ నుంచి రూ.40 వేలు మంజూరయ్యాయని తెలిపారు. పైప్ లైన్ నిర్మాణం చేపట్టడానికి కాలనీకి లో పనులు చేపట్టేందుకు వెళ్లడంతో కాలనీ వాసులు పైప్ లైన్ నిర్మాణ పనులను వద్దన్నారని తెలిపారు. ఆ నిధులు ల్యాబ్స్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ద్వారా పైప్ లైన్ నిర్మాణానికి ఏఈ ద్వారా ఎస్టిమేంట్ వేసినట్లు రూ.1.25 లక్షలు మంజూరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంజూరు కాగానే పైప్ లైన్ నిర్మాణం చేస్తామని అన్నారు.






