ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? పల్లె ఆహార భద్రత గాలికి.. పట్టణాలకే తనిఖీలు

by Ramesh Naini |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆహార భద్రత తనిఖీలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుండటంతో పల్లె ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? పల్లె ఆహార భద్రత గాలికి.. పట్టణాలకే తనిఖీలు
X

ఆహార భద్రత తనిఖీలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుండడంతో పల్లె ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల కొరత తీవ్రంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. కల్తీ మాఫియా అంగళ్లు, జాతర్లను అడ్డాగా చేసుకుని విషాన్ని విక్రయిస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితమైన ఫుడ్ సేఫ్టీ విభాగం, క్షేత్రస్థాయిలో నమూనాల సేకరణను అటకెక్కించింది. పల్లె ప్రజల ప్రాణాలకు రక్షణ లేని ఈ ‘ఆహార భద్రత’ వ్యవస్థ అసలు ఎవరి కోసం పని చేస్తోంది అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సిబ్బంది కొరత నెపంతో వేలాది మంది గ్రామీణుల ఆరోగ్యంతో చెలగాటమాడడం ప్రభుత్వ వైఫల్యమే. సిబ్బంది లేరనే సాకుతో పల్లె ప్రజల ప్రాణాలను ప్రభుత్వం గాలికి వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆహార భద్రత తనిఖీలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుండటంతో పల్లె ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. జిల్లా వ్యాప్తంగా ఆహార తనిఖీ అధికారుల కొరత వేధిస్తుండటం కల్తీ మాఫియాకు వరంగా మారింది. నాలుగు జిల్లాల పరిధిలో కేవలం ఒకరిద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉండగా, మిగిలిన చోట్ల కనీస అవగాహన లేని ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రాల్లో అడపాదడపా హడావుడి చేస్తున్న అధికారులు, పల్లెటూళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ శూన్యం కావడంతో అసలు ఫుడ్ సేఫ్టీ విభాగం ఉనికిలో ఉందా అన్న అనుమానాలు గ్రామీణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

కొరతతో కుంటుపడుతున్న వ్యవస్థ..

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు నామమాత్రంగానే దర్శనమిస్తున్నాయి. కీలకమైన ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో, పక్క జిల్లాల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరు కేవలం కార్యాలయాలకే పరిమితమై లైసెన్సులు, జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల సర్టిఫికెట్లు జారీ చేయడంలోనే బిజీగా ఉంటున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి నమూనాలు సేకరించడం, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి పనులను పూర్తిగా అటకెక్కించారు. గత కొన్నేళ్లుగా ఒక్క గ్రామంలో కూడా ఆహార తనిఖీ జరిగిన దాఖలాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది.

అంగళ్లు, జాతర్లలో జోరుగా విక్రయం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వారం జరిగే అంగళ్లు, పండగ సమయాల్లో నిర్వహించే జాతర్లలో కల్తీ పదార్థాల విక్రయం అడ్డగోలుగా సాగుతోంది. చిన్న చిన్న హోటళ్లు, దుకాణాల్లో నాణ్యత లేని నూనెలు, పదేపదే మరిగించిన (రీ-యూజ్డ్) ఆయిల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పట్టణాల్లో కనిపించే కల్తీ పల్లెటూళ్లలో అధికారులకు ఎందుకు కనిపించడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20కి పైగా ప్రసిద్ధ దేవాలయాల్లో నిత్యం జాతరలు జరుగుతున్నా, అక్కడ అమ్ముతున్న తినుబండారాలపై ఫుడ్ సేఫ్టీ విభాగం కనీస నిఘా పెట్టడం లేదు. సిబ్బంది లేరనే సాకుతో పల్లె ప్రజల ప్రాణాలను ప్రభుత్వం గాలికి వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story