డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు..!?

by Batti.Sumithra |

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు డ్రైనేజీ నిర్మాణానికి అప్పటి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.

డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు..!?
X

దిశ, కుబీర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు డ్రైనేజీ నిర్మాణానికి అప్పటి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. అయితే ఇప్పటివరకు పనులు చేపట్టడానికి మోక్షం లభించడం లేదని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ముందుచూపు లేకపోతే వచ్చే వర్షాకాలంలో వరద నీటితో ఆసుపత్రి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మండల వాసులు అంటున్నారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకముందే, సంబంధిత శాఖ అధికారులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో వరద నీటి కారణంగా ఆసుపత్రికి రోగులు రావడానికైనా, సిబ్బంది లోపలికి వెళ్లడానికైనా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఆసుపత్రి ముందు నిలిచిన వరద నీటిలో వరి నాట్లు వేసి యువకులు నిరసన తెలిపిన సందర్భం కూడా ఉంది. సంబంధిత శాఖ జిల్లా అధికారులు ఆసుపత్రి ముందు డ్రైనేజీ పనులను తక్షణమే ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story