మణిపూర్‌‌లో మళ్లీ మొదలైన హింస.. ముగ్గురు పౌరులు దుర్మరణం

by Kema Shiva Kumar |

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు.

మణిపూర్‌‌లో మళ్లీ మొదలైన హింస.. ముగ్గురు పౌరులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur)లో మళ్లీ హింసాత్మక ఘటనలకు మొదలయ్యాయి. తాజాగా కాంగ్‌పోక్పి (Kangpokpi) జిల్లాలో చోటుచేసుకున్న ఘోర హింసాకాండలో ముగ్గురు పౌరులు (Civilians) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కథనం మేరకు ఇవాళ తెల్లవారుజామున అధునాతన ఆయుధాలతో వచ్చిన ఓ సాయుధ బృందం కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని ఓ గ్రామంపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. గ్రామంలోని నివాసాలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు గ్రామస్థులు అక్కడికక్కడే బుల్లెట్ గాయాలతో మరణించారు. కాల్పుల అనంతరం దుండగులు గ్రామంలోని పలు కుకీ (Kuki) వర్గానికి చెందిన ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పలు గృహాలు పూర్తిగా బూడిదయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్థులు ప్రాణాలు రక్షించుకునేందుకు పక్కనే ఉన్న అటవీ ప్రాంతాల్లోకి పరుగులు తీశారు.

రంగంలోకి అదనపు బలగాలు..

కాంగ్‌పోక్పి ఘటనపై సమాచారం అందిన వెంటనే అస్సాం రైఫిల్స్ (Assam Rifles), కేంద్ర బలగాలు, మణిపూర్ రాష్ట్ర పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. భద్రతా బలగాల రాకను గమనించిన సాయుధ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్య నిందితుల కోసం పరిసర ప్రాంతాలతో పాటు అడవుల్లో గాలిస్తున్నారు. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా ఉండేందుకు కాంగ్‌పోక్పి, దాని సరిహద్దు జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించారు.

Next Story