- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటి కష్టాలు
వేసవి ప్రారంభంలోనే ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాల క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే నీటి మట్టం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

దిశ, ఆదిలాబాద్ : వేసవి ప్రారంభంలోనే ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాల క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే నీటి మట్టం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలోనే ఈ స్థాయి పడిపోవడం రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రమవుతుందో సూచిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే వేసవి చివరికి మొత్తానికి కింది స్థాయికి భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో బోరు బావులు ఎండిపోతూ, ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు ఉన్నా నిల్వల లోపం..
ఆదిలాబాద్ జిల్లా సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. సంవత్సరానికి సగటున 1000 నుంచి 1150 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. గత ఏడాది కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. అయినప్పటికీ ఆ నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ఎక్కువగా వాగులు, వంకల ద్వారా వృథాగా పారిపోతోంది. దీంతో భూగర్భ జలాలు పెరగాల్సిన స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. నీటి సంరక్షణ పథకాల అమలు లోపం భూగర్భ జలాల క్షీణతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి నిల్వ చర్యలు తగినంతగా చేపట్టకపోవడం వల్ల పరిస్థితి దిగజారుతోంది. భూమి స్వభావం కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిసినా నీరు భూమిలో నిల్వ కాకుండా పారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
పరిష్కార మార్గాలపై దృష్టి..
భూగర్భ జలాలను పెంచేందుకు తక్షణ చర్యలు అవసరం. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించడం, పొలాల్లో చిన్న గుంతలు తవ్వడం, వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వంటి చర్యలు చేపడితే నీటి నిల్వలు పెరుగుతాయి. ఉపాధి హామీ పథకం కింద గట్లు, కండకాలు పనులు కూడా దీనికి దోహదపడతాయి. జిల్లాలో నీటి లభ్యత గణాంకాలు పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో మిగులు ఉన్నప్పటికీ భూగర్భ జలాల స్థాయిలో మాత్రం క్షీణత కొనసాగుతోంది. ఇది నీటి నిర్వహణలో లోపాలను సూచిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజలు కలిసి నీటి సంరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే మే నెలలో నీటి సంక్షోభం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది.






