- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ రాజర్షిషా
సర్పంచ్ లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు.

దిశ, ఆదిలాబాద్ : సర్పంచ్ లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్ లో గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు 'మూడవ కన్ను'లా పని చేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగు చేసే రైతులపై కఠిన చర్యలు ఉంటాయని, ఇప్పటికే కొంతమంది రైతుల వివరాలను అగ్రికల్చర్ కమిషనర్‌కు పంపి వారి రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను నిలిపివేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాల పై తీర్మానం చేయాలని కోరారు. ప్రతి గురువారం 'ఆరోగ్య పాఠశాల'లో భాగంగా విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ డే నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
సమిష్టి బాధ్యతతోనే గంజాయి నిర్మూలన : ఎస్పీ అఖిల్ మహాజన్
గంజాయి సాగు,విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చడంలో భాగంగా పోలీస్ శాఖలో ప్రత్యేకంగా 'ఈగల్ ఫోర్స్' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యువత గంజాయికి అలవాటు పడితే వారి జీవితాలతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కోసం రిమ్స్, డవ్ సెంటర్లలో కౌన్సిలింగ్, డీ-అడిక్షన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, సర్పంచులు బాధితుల జాబితా ఇస్తే వారిని మార్చడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు భద్రత లో భాగంగా'అరైవ్ అలైవ్' కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్పీ సూచించారు. మహిళా భద్రత కోసం జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ (బాల్య వివాహాలు) అరికట్టడానికి పోలీసు అక్క, షీ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నాయని, గత మూడు నెలల్లో 25 బాల్య వివాహాలను అడ్డుకున్నామని తెలిపారు. కల్లులో అల్ప్రాజోలం వంటి రసాయనాలు కలపడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని, అటువంటి వారిపై నిఘా ఉంచాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదక ద్రవ్యాల (గంజాయి) నిర్మూలనకు కృషి చేసి ఆరోగ్య వంతమైన సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరం పాటుపడదాం అని కార్యక్రమానికి హాజరైన వారందరితో కలిసి కలెక్టర్, ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి.సీతారాం, అదనపు ఎస్పీ పి.కృష్ణ మూర్తి, సిఐ పి.ప్రకాష్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీలు బి.సురేందర్ రావు, పి.మౌనిక, ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, విజేందర్, పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, డౌవ్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.






