పర్ధాన్ గూడ వద్ద బైక్ ను ఢీకొన్న వాహనం

by Batti.Sumithra |

మితిమీరిన వేగం ఇద్దరు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది.

పర్ధాన్ గూడ వద్ద బైక్ ను ఢీకొన్న వాహనం
X

దిశ, కాగజ్ నగర్ : మితిమీరిన వేగం ఇద్దరు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. పట్టణ శివారులోని ప్రధాన్ గూడ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఎదురెదురుగా వస్తున్న టాటా మ్యాజిక్, బైక్ బలంగా ఢీ కొనడంతో రహదారి రక్తసిక్తమైంది. కాగజ్ నగర్ పట్టణం నుండి సిర్పూర్ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న జగన్, శిల్ప అనే ఇద్దరు వ్యక్తులు తమ బైక్ పై ప్రధాన్ గూడ మలుపు వద్దకు చేరుకోగానే, ఎదురుగా అతి వేగంగా దూసుకొచ్చిన టాటా మ్యాజిక్ వాహనం వారిని అమాంతం ఢీ కొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బైక్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా, బైక్ పై ఉన్న ఇద్దరు తీవ్రగాయాలతో రోడ్డు పై పడి విలవిల్లాడారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కాగజ్ నగర్ లోని ప్రజాలైఫ్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. జగన్, శిల్పలకు తల, కాళ్ల భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కాగజ్ నగర్ సిర్పూర్ రహదారి పై వాహనాల వేగానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద డ్రైవర్ల అజాగ్రత్త అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story