- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకాల వర్షం బీభత్సం..ఉమ్మడి జిల్లాలో ఐదుగురు బలి!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించి ఐదుగురిని బలితీసుకుంది.

అకాల వర్షం బీభత్సం..
ఉమ్మడి జిల్లాలో ఐదుగురు బలి!
లక్షెట్టిపేటలో గోడ కూలి నలుగురు రైతులు దుర్మరణం.. మృతుల్లో తండ్రీకొడుకులు
ఆసిఫాబాద్ జిల్లాలో ఇనుపపెట్టె కూలి మహిళ మృతి.. ఉమ్మడి జిల్లాలో విషాదఛాయలు
ఈదురుగాలుల ధాటికి చెల్లాచెదురైన ధాన్యం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో శోకసంద్రంలో గ్రామం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించి ఐదుగురిని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోడ కూలి నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. ధాన్యం కాపాడుకునేందుకు గోడ చాటుకు వెళ్లిన రైతులపై గోడ కూలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తండ్రీకొడుకులు నాగరాజు, అభిరామ్ ఉండడం ఆ కుటుంబంలో తీరని శోకం నింపింది. గాయపడిన మరో రైతు హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కొమురంభీం జిల్లా కోర్సినిలో ఇనుప పెట్టె కూలి సుగుణ అనే మహిళ మృతి చెందారు. ఈదురుగాలులకు ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దిశ ప్రతినిధి, నిర్మల్/మంచిర్యాల/లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. నిన్నటి వరకు భానుడి ప్రతాపంతో అల్లాడిన జనానికి, బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రైతులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
గోడకూలి నలుగురు రైతుల మృతి...
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో ఈదురుగాలుల ధాటికి గోడ కూలి నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు నిల్వ ఉంచారు. ఒక్కసారిగా భారీ గాలివాన రావడంతో, రైతులు రక్షణ కోసం సమీపంలోని గోడ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో దండేపల్లి మండలంలోని ముత్యంపేటకు చెందిన నెల్కి లచ్చన్న తన కుమారుడిని బస్సు ఎక్కించి, వర్షం నుంచి తలదాచుకోవడానికి అదే గోడ వద్దకు వచ్చారు. అయితే, గాలి వేగానికి ఆ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో లచ్చన్నతోపాటు రైతులు గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు నాగరాజు, అభిరామ్ ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. మరో రైతు సీదుల హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ దుర్మరణం..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈదురుగాలులు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లర్ కోసం అమర్చిన ఇనుప పెట్టె ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంటి యజమానురాలు సుగుణ (45)పై ఆ ఇనుప పెట్టె పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అకాల వర్షం కారణంగా అటు ప్రాణ నష్టం, ఇటు పంట నష్టం సంభవించడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.






