టీఆర్‌ఎస్‌లో ముసలం.. కేటీఆర్ ఏకపక్ష నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో ఆ జిల్లా మంత్రి..!

by Web Desk |
టీఆర్‌ఎస్‌లో ముసలం.. కేటీఆర్ ఏకపక్ష నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో ఆ జిల్లా మంత్రి..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ పార్టీలో డీసీసీబీఛైర్మన్ పీఠం ముసలం పుట్టించిందా.. కొత్త డీసీసీబీ ఛైర్మను ఎంపిక విషయంలో పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక వచ్చిందా.. ఆ రామన్న.. ఈ రామన్నకు ఏకపక్షంగా మాట ఇవ్వటంతో మూడు జిల్లాల ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారి తీసిందా.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం తమను సంప్రదించకుండానే.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం మంత్రి, విప్, ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమైందా.. అంటే తాజా పరిస్థితులు, పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మను పదవిని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అడ్డి భోజారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. మూడు జిల్లాల ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటం చర్చకు దారి తీస్తోంది..!

ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మనుగా రెండేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా నార్నూరుకు చెందిన నాందేవ్ కాంబ్లేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ జిల్లా నుంచి రఘునందన్ రెడ్డి కోసం.. జోగు రామన్న అడ్డి భోజారెడ్డి కోసం ప్రయత్నించారు. అధిష్టానం ఎస్సీ కేటగిరీకి కేటాయించగా.. నాందేవ్ కాంబ్లేకు డీసీసీబీ పీఠం కట్టబెట్టారు. అధిష్టానం నిర్ణయం కాదనలేక మంత్రి అల్లోలతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, మిగతా ఎమ్మెల్యేలంతా ఏం అనలేక ఊరుకుండి పోయారు. జూలై 28న నాందేవ్ కాంబ్లే గుండెపోటుతో మరణించగా.. డీసీసీబీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. ఆరు నెలల నుంచి వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి ఇంచార్జి ఛైర్మనుగా ఉండగా.. తాజాగా మళ్లీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అడ్డి భోజారెడ్డికే డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కింది. అధిష్టానం నిర్ణయంతో ఆయన శనివారం డీసీసీబీ ఛైర్మనుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తాజాగా అడ్డి భోజారెడ్డి ఎన్నిక.. అధిష్టానం సూచన మేరకు జరిగింది. ఈ ఎన్నిక కార్యక్రమానికి డీసీసీబీ డైరెక్టర్లతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ రాథోడ్ జనార్ధన్ మాత్రమే హాజరయ్యారు. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు జెడ్పీ ఛైర్ పర్సన్లు దూరంగా ఉండటానికి అధిష్టానం తీరే కారణమనే చర్చసాగుతోంది. ఇటీవల జోగు రామన్నతో పాటు ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. డీసీసీబీ ఛైర్మన్ పదవి గతంలో ఆదిలాబాదు జిల్లా వారికే ఉందని.. ఆయన చనిపోవటం వల్ల ఖాళీ అయినందున మళ్లీ తమకే ఇవ్వాలని కోరారు. గతంలో మాదిరిగానే నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు ఉంటాయని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటతో ఏకీభవించిన కేటీఆర్.. వెంటనే మాట ఇచ్చేశారు. దీంతో అడ్డి భోజారెడ్డి పేరు ఖరారు చేశారు.

ఇదే విషయంపై ఇటీవల మంత్రి కేటీఆర్.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోను చేశారు. డీసీసీబీ ఛైర్మన్ పదవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిందని.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను సంప్రదించాక నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మంత్రి అల్లోల.. కేటీఆర్‌తో స్పష్టం చేశారు. అప్పటికే ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు మాట ఇచ్చేసిన కేటీఆర్.. తన మాట నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే మంత్రి అల్లోలతో మాట్లాడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. అల్లోలతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. అందరు ఎమ్మెల్యేలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని.. డీసీసీబీ ఛైర్మన్ పదవిని చెరో ఏడాదిన్నర పాటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల వారికి ఇస్తే బాగుండేదని అల్లోల తన అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. మంత్రి నిరంజన్ రెడ్డి రాయబారం నడిపినా.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, చీలిక లేకుండా చేయలేకపోయారు.

డీసీసీబీ ఛైర్మనుగా ప్రస్తుత వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జి.విఠ్ఠల్ రెడ్డి (ముధోల్), అజ్మీరా రేఖానాయక్(ఖానాపూర్), నడిపెల్లి దివాకర్ రావు(మంచిర్యాల), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) మద్దతుగా నిలిచారు. ఇక రఘునందన్ రెడ్డికి ఇవ్వని పక్షంలో బాలూరి గోవర్ధన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. గతంలో ఎస్సీ సామాజిక వర్గం వారే డీసీసీబీ ఛైర్మన్ గా ఉన్నందున.. తాజాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టు బట్టారు. రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా అడ్డి భోజారెడ్డి పేరు ఖరారు చేయడం, కనీసం తమ అభిప్రాయం కూడా తీసుకోకపోవటం పట్ల మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే డీసీసీబీ ఎన్నికకు దూరంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. ఇక ఇటీవల డీసీసీబీ డైరెక్టర్లు కడెంలో సమావేశమవగా.. వారి అభిప్రాయం కూడా తీసుకోకుండానే అధిష్టానం ఏకపక్షంగా ఎంపిక చేసిందనే చర్చ నడుస్తోంది.



Next Story

Most Viewed