‘ఉద్యోగం ఇచ్చి.. మళ్లీ తీసేస్తున్నారు సార్’.. కలెక్టరేట్‌లో మహిళ ఆవేదన

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బంగారుగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో ఇటీవల ప్రీ ప్రైమరీ టీచర్ (ఇన్‌స్ట్రక్టర్‌)గా ఎంపికైన కొత్తపెల్లి ప్రతిభను విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

‘ఉద్యోగం ఇచ్చి.. మళ్లీ తీసేస్తున్నారు సార్’.. కలెక్టరేట్‌లో మహిళ ఆవేదన
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బంగారుగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో ఇటీవల ప్రీ ప్రైమరీ టీచర్ (ఇన్‌స్ట్రక్టర్‌)గా ఎంపికైన కొత్తపెల్లి ప్రతిభను విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పారదర్శకంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో అన్ని ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం తనను ఎంపిక చేశారని, ఇప్పటికే విధుల్లో చేరి తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం మరో అభ్యర్థిని నియమించేందుకు ప్రయత్నించడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికతకు సంబంధించిన పత్రాలు సమర్పించని అభ్యర్థి దరఖాస్తు తొలుత తిరస్కరించబడగా, ఇప్పుడు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ అభ్యర్థిని తీసుకునేందుకు తనను తొలగించడం సరైంది కాదన్నారు. తనను ఇన్‌స్ట్రక్టర్‌గా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినప్పటికీ.. 'తామేం చేయలేము' అనే సమాధానం రావడం మరింత బాధ కలిగించిందని వాపోయారు. ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే తమ సమస్యను ఎవరి వద్ద చెప్పుకోవాలని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.

Next Story